పోలవరంలో సవరించిన అంచనా వ్యయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరాం : ఏపీ ఈఎన్‌సీ

హైదరాబాద్‌లో పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సమావేశం నిర్వహించారు. సమావేశంలో అథారిటీ సభ్యులు హాజరై... అభిప్రాయాలు వ్యక్తంచేశారు. పోలవరంలో..

Update: 2020-11-02 14:49 GMT

హైదరాబాద్‌లో పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సమావేశం నిర్వహించారు. సమావేశంలో అథారిటీ సభ్యులు హాజరై... అభిప్రాయాలు వ్యక్తంచేశారు. పోలవరంలో సవరించిన అంచనా వ్యయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరినట్టు ఏపీ ఈఎన్‌సీ నారాయణరెడ్డి తెలిపారు. ఇందుకు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సానుకూలంగా స్పందించిందని అన్నారు. తమ ప్రతిపాదనను కేంద్ర జలశక్తిశాఖకు విన్నవిస్తామని చెప్పినట్టు వెల్లడించారు.

పోలవరం ప్రాజెక్టు పరిధిలో బ్యాక్‌ వాటర్‌ ప్రభావంపై అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని తెలంగాణ ప్రభుత్వం అభిప్రాయపడింది. ఈ మేరకు తెలంగాణ ఇరిగేషన్‌ ఈఎన్‌సీ మురళీధర్‌రావు పోలవరం ప్రాజెక్టు అథారిటీ అధికారులకు లేఖ రాశారు. 2009లో కృష్ణా నదికి వచ్చిన వరదతో అనేక ప్రాంతాలు ముంపునకు గురయ్యాయని పేర్కొన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని గోదావరిపై నిర్మిస్తున్న పోలవరం విషయంలోనూ... తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అటు.. ముంపుపై తెలంగాణ అభ్యంతరాలు పెద్ద ఇష్యూ కాదని ఏపీ ఈఎన్‌సీ నారాయణరెడ్డి అన్నారు. ప్రాజెక్ట్‌ను నింపినప్పుడు సమస్య వస్తే అప్పుడే పరిష్కరించుకుంటామని పేర్కొన్నారు. ముంపుపై అధ్యయనం ముగిసిన అధ్యాయమని వ్యాఖ్యానించారు.

పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశం సందర్భంగా.... వివిధ రాజకీయ పార్టీలు, రైతు సంఘాల ప్రతినిధులు అథారిటీ ఛైర్మన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్‌తో సమావేశమయ్యారు. మాజీమంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ఆంధ్రా మేధావుల సంఘం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్‌ సమావేశమయ్యారు. విభజన చట్టం ప్రకారం పోలవరం నిర్మాణం చేపడతామని కేంద్రం తెలిపిందని చెప్పారు. 2013-14 అంచనాల ప్రకారం నిధులు ఇస్తామని చెప్పడంతో ఏపీ ప్రజలపై పిడుగు పడినట్లయిందని వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. పూర్తి నిధులు ఇవ్వకపోతే 13 జిల్లాల్లో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతాయని హెచ్చరించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ పోలవరం జాతీయ ప్రాజెక్టు కాబట్టి... నిధుల మొత్తాన్ని కేంద్రమే భరించాలని అన్నారు. ఏపీలో అన్ని పక్షాలు ఏకమై దిల్లీపై ఒత్తిడి పెంచాలని అభిప్రాయపడ్డారు. సీఎం జగన్‌ వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి... కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. 

Tags:    

Similar News