POLAVARAM: కుంగిన పోలవరం కాఫర్ డ్యాం
ఎగువ కాఫర్ డ్యాంపై కుంగిన మట్టి రాళ్లు... కుంగిన ప్రాంతాన్ని పటిష్టపరిచిన అధికారులు... ప్రమాదం లేదని అధికారుల ప్రకటన;
పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం.. ఎట్టి పరిస్థితుల్లోనూ 2027 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలనే టార్గెట్‌తో ముందుకు వెళ్తున్నారు. పది రోజులుగా ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు పోలవరం ప్రాజెక్ట్‌కు వరదనీరు పోటెత్తింది. దీంతో ఎగువ కాఫర్ డ్యాంలో కొంత భాగం పాడైనట్టు తెలుస్తోంది. 10 అడుగుల వెడల్పు, 8 అడుగుల లోతున కాఫర్ డ్యాంకు డ్యామేజ్ వాటిల్లినట్టు చెబుతున్నారు. ఇప్పటికే 2022 ఆగస్ట్ భారీ వరదలకు ఎగువ కాఫర్ డ్యాం సీపేజ్ కొంతమేర దెబ్బతింది. దిగువన బట్రస్ డ్యాం నిర్మాణం, ఎగువన ఎత్తు, వెడల్పు పెంచిన చోటే ఇప్పుడు కొంతమేర నిర్మాణం దెబ్బతిన్నట్టు సమాచారం. అయితే, దీనివల్ల పెద్దగా నష్టం లేదని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. దెబ్బతిన్న ప్రాంతంలో మరమ్మతులు కూడా పూర్తి చేసినట్టు అధికారులు వెల్లడించారు. కాపర్ డ్యాం నుంచి సీపేజ్ కొనసాగుతుండడంతో.. ఎప్పటికప్పుడు డీ వాటరింగ్ చేస్తూ డయాఫ్రం వాల్ నిర్మాణ పనులు చేపడుతున్నట్టు తెలుస్తోంది. గతంలో వచ్చిన వరదల కారణంగా కాపర్ డ్యాంపై మరో రెండు మీటర్లు ఎత్తు పెంచారు అధికారులు.. అయితే, ఎత్తు పెంచిన ప్రాంతంలో మాత్రమే మట్టి జారిందని.. వెంటనే దానిని పటిష్టపరిచామని అధికారులు చెబుతున్నారు.
ఇదే మొదటిసారి కాదు
పోలవరం ఎగువ కాఫర్ డ్యాం దెబ్బతినడం ఇది మొదటిసారి కాదు. గతంలో 2022 ఆగస్టు నెలలో వచ్చిన భారీ వరదలకు కూడా ఇదే తరహాలో డ్యాంకు నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ అదే సమస్య పునరావృతం కావడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. వరద ప్రవాహం కొనసాగుతుండటంతో అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. దెబ్బతిన్న ప్రాంతంలో రిపేర్లు చేపట్టినట్టు అధికారులు తెలిపారు. 2022లో వచ్చిన వరదల కారణంగా డ్యాం మరో రెండు మీటర్లు అదనంగా పెంచారు. పెంచిన ప్రాంతంలో మాత్రం కొద్దిగా మట్టి కుంగడంతో అధికారులు యుద్ధ ప్రాతిపదికన దాన్ని పటిష్టపరిచారు. కాపర్ డ్యాం పటిష్టతకు తోడు దిగువన బట్రస్ డ్యాం నిర్మాణం చేపట్టడంతో పోలవరం ప్రాజెక్టు పనులకు ఎలాంటి ఇబ్బంది లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. కాఫర్ డ్యాం వెడల్పు 9 మీటర్లు ఉండేలా.. ఎత్తు మరో 2 మీటర్ల మేర పటిష్ఠం చేశారు. అలా పైన పెంచిన ప్రాంతంలో మాత్రమే ఇప్పుడు కొద్దిగా జారిందని అధికారులు వివరించారు. మళ్లీ వాహనాల రాకపోకలు కూడా ప్రారంభమయ్యాయని, సమస్య ఏమీ లేదని తెలిపారు.