AP : మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి పోలీసులు నోటీసులు
మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. కోవూరు టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై ఆయనపై కేసు నమోదైంది. ఈ నెల 25వ తేదీన విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు పోలీసుల నుంచి నోటీసులు అందుకున్నారు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి. కోవూరు పోలీసులు ప్రశాంతిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ప్రసన్న కుమార్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. భారత శిక్షా స్మృతిలోని 74, 75, 79, 296 సెక్షన్ల కింద ఈ కేసు నమోదైంది. ఈ కేసులో ప్రసన్న కుమార్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. బి.ఎన్.ఎస్ (భారతీయ న్యాయ సంహిత) 35(3) ప్రకారం నోటీసులు ఇచ్చి విచారణ చేయాలని హైకోర్టు పోలీసులకు సూచించింది. మహిళా ఎమ్మెల్యేపై చేసిన వ్యాఖ్యలను హైకోర్టు తీవ్రంగా తప్పు పట్టింది. ఈ వ్యాఖ్యలు నెల్లూరు జిల్లా రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపాయి. ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి కూడా జరిగింది.