POLITICS: అక్కడ షర్మిల కొడుకు..ఇక్కడ కవిత కుమారుడు
రాజకీయాల్లోకి కవిత, షర్మిల వారసులు.. షర్మిల, కవితకు చాలా విషయాల్లో పోలిక.. సొంతంగా రాజకీయ అడుగులు వేస్తున్న సిస్టర్స్
తెలుగు రాష్ట్రాలలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితకు, ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్.షర్మిలకు చాల విషయాల్లో పోలిక కనిపిస్తుంటుంది. ఇద్దరు కూడా తమ అన్నలు కేటీఆర్, జగన్ లతో పేచీలు, రాజకీయంగా సొంత పార్టీల నుంచి గెంటివేతలకు గురైన వారే. వారిద్దరు ప్రస్తుతం సొంతంగా తమ రాజకీయ ఎదుగుదలకు ప్రయత్నిస్తున్నారు. షర్మిల ఏపీ కాంగ్రెస్ నుంచి తన రాజకీయ పోరాటాన్ని కొనసాగిస్తోంది. కవిత తెలంగాణ జాగృతి నుంచి తెలంగాణ యాత్రకు సిద్దమవుతోంది. తాజాగా వారి వారసులను కూడా వారు రాజకీయ తెరపైకి తేవడం హాట్ టాపిక్ గా మారింది. ఇందులోనూ వారిద్దరి మధ్య మంచి పోలికే కుదిరింది. ఇటీవల కర్నూలు ఉల్లి మార్కెట్ కి తల్లి షర్మిలతో కలిసి ఆమె కుమారుడు రాజారెడ్డి సందడి చేశారు. తాజాగా బీసీ బంద్ లో పాల్గొన్న కవిత కుమారుడు ఆదిత్య సర్ ప్రైజ్ ఇచ్చారు. ఇలా తెలుగు రాష్ట్రాల పొలిటికల్ స్క్రీన్ పై కవిత, షర్మిల రాజకీయ వారసులు తళుక్కుమన్నారు.
ఒకవైపు తమ రాష్ట్రాలలో తమ రాజకీయ ఆధిపత్య పోరాటాన్నికొనసాగిస్తునే..మరోవైపు తమ వారసుల భవిష్యత్ కు కవిత, షర్మిలలు రాజకీయ బాటలు వేస్తున్నట్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు. షర్మిల కవిత ఇద్దరి పోరాటం ప్రధానంగా తమ తమ అన్నలపైనే. అధికారంలోకి వచ్చాక జగన్ మోహన్ రెడ్డి తనను పక్కన పెట్టారని షర్మిల పదేపదే ఆరోపిస్తారు. కవిత ఆరోపణ కూడా అదే కాకపోతే ఆమె డైరెక్ట్ గా పేరు ఎత్తలేదు ఇంకా. షర్మిల, కవిత ఇద్దరు ముఖ్యమంత్రుల కుమార్తెలు. తండ్రి చనిపోయాక షర్మిల, తెలంగాణ ఉద్యమ సమయంలో కవిత ప్రజాక్షేత్రంలో బాగా నలిగినవారే. ఎండలను లెక్కచేయకుండా అన్న కోసం పాదయాత్ర చేసిన గతం షర్మిలది అయితే తెలంగాణ కోసం సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుతూ ప్రజలను జాగృతం చేసేన చరిత్ర కవిత కు ఉంది. ఒకానొక దశలో అన్నమాటే తమ మాటగా ఇద్దరూ పేరు తెచ్చుకున్నారు. రాజకీయంగా ఇద్దరి భర్తలూ సైలెంట్ గా ఉండేవారే. ఢిల్లీ స్థాయిలో ఇద్దరికీ తమదైన ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా అప్పట్లో అన్నపై ప్రస్తుతం కూటమి పై తన పోరాటం చేస్తున్నారు. మెయిన్ ఫోకస్ అన్న జగన్ పైన అనేది బహిరంగ రహస్యం. ఇప్పుడు తెలంగాణలో కవిత కూడా అదే పనిలో ఉన్నారు. రేపో మాపో సొంత పార్టీ ప్రకటన రావచ్చనేది రాజకీయ వర్గాల్లో బలంగా సాగుతున్న చర్చ. కానీ తనకు అధినేత కేసీఆరేనని, కొత్త పార్టీ పెట్టే ఉద్దేశం లేదని ఆమె స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య పోలికలు, వ్యత్యా సాల పై రకరకాల చర్చలు నడుస్తున్నాయి.