MODI TOUR: ఈనెల 8న విశాఖకు ప్రధాని మోదీ
శరవేగంగా జరుగుతున్న ఏర్పాట్లు... సమీక్ష నిర్వహించిన మంత్రి నారా లోకేశ్;
ఈ నెల 8న ప్రధానమంత్రి నరేంద్రమోదీ విశాఖలో పర్యటనకు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. బహిరంగ సభకు ప్రధానవేదిక పనులు ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో శరవేగంగా జరుగుతున్నాయి. మంత్రి లోకేశ్ ప్రధాని పర్యటన ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లపై విశాఖ కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లాల వారీగా వచ్చే వారికి రవాణా సౌకర్యాలు కల్పించాలని లోకేశ్ ఆదేశించారు. సుమారు 3లక్షల మంది హాజరయ్యే అవకాశముందని అంచనా వేశారు. లోకేశ్ ప్రధాని పాల్గొనే బహిరంగ సభ సథలాన్ని ఆయన పరిశీలించనున్నారు.
ప్రధాని మోదీ పర్యటనలు ఇలా..
ప్రధాని మోదీ ముందు ఎన్‌టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు, నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్, విశాఖ రైల్వే జోన్, పారిశ్రామిక నోడ్‌లకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ప్రధాని మోదీతో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రోడ్ షో లో పాల్గొననున్నారు. విశాఖ సిద్ధి వినాయక ఆలయం నుంచి సభ వేదిక వరకూ జరిగే రోడ్ షో కోసం మూడు పార్టీలతో సమన్వయ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆ తర్వాత భహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొననున్నట్లు అధికారులు తెలిపారు.
ప్రణాళికలు సిద్ధం చేసిన అధికారులు
ప్రధాని పర్యటనకు జిల్లా యంత్రాంగం ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రధాని, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ పాల్గొనే రోడ్‌షో సిరిపురం కూడలి నుంచి మొదలై ఏయూ ఇంజినీరింగ్ కళాశాల వరకు సాగనుంది. 45 నిమిషాలు సాగే రోడ్‌షోలో కనీసం 60 వేల మంది పాల్గొనే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రధాని 8వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరి ప్రత్యేక విమానంలో ఐఎన్‌ఎస్ డేగాకు చేరుకుంటారు. స్వాగత కార్యక్రమాల తర్వాత 4.20 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 4.45 గంటలకు రోడ్‌షోకు వెళ్తారు. 5.30 గంటలకు సభలో పాల్గొంటారు. 6.30 గంటలకు సభ ముగిసిన తర్వాత ప్రధానమంత్రి, సీఎం, డిప్యూటీ సీఎం కలిసి వేదిక నుంచి ఎయిర్‌పోర్టుకు వెళ్లనున్నారు. 7 గంటలకు ప్రత్యేక విమానంలో ప్రధానమంత్రి భువనేశ్వర్‌కు పయనమవుతారు.