pulivendula: పులివెందుల్లో ఓడిపోతామనే భయంతో డైవర్షన్
వైసీపీపై మండిపడ్డ మంత్రి సవిత;
వైసీపీ నాయకుల దౌర్జన్యాలు, బెదిరింపులు, ఘర్షణలు చూసి తన తండ్రి వైఎస్ వివేకా జయంతికి పులివెందులకు రావాలన్నా సునీత భయపడ్డారని బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత అన్నారు. వరసగా మూడ్రోజులపాటు జరుగుతున్న దాడులన్నీ వైసీపీ వారే చేసుకొని ఆ నెపాన్ని టీడీపీపై వేసి ఉంటారని సునీత ఆందోళన వ్యక్తం చేశారని చెప్పారు. దీన్ని బట్టే పులివెందులలో వైసీపీ నేతల తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. ‘‘పులివెందులలో వైసీపీ నాయకులు ఓడిపోతారనే భయంతోనే ధర్నాలు, పోలీసులను బెదిరించి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. మేం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో పాల్గొంటాం. జగన్ రప్పా.. రప్పా అనే వ్యాఖ్యలు, వైసీపీ నేతలు మాట్లాడుతున్న అసభ్యకరమైన మాటలు రాష్ట్ర ప్రజలంతా చూస్తున్నారు. సూపర్‌సిక్స్ పథకాలు, ఏడాది నుంచి పులివెందులలో ప్రశాంతతతో ఇక్కడి రెండు స్థానాలు టీడీపీ గెలుచుకుంటుంది’’అని మంత్రి సవిత ధీమా వ్యక్తం చేశారు.
వైఎస్ భాస్కర్ రెడ్డి, శివశంకర్‌రెడ్డికి నోటీసులు
టీడీపీ నేత విశ్వనాథరెడ్డిని ఫోన్లో బెదిరించిన కేసులో.. వైఎస్ భాస్కర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డికి పులివెందుల పోలీసులు 41ఏ నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్ వెళ్లి ఇద్దరికీ నోటీసులు అందజేశారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వీరిద్దరూ నిందితులుగా ఉన్నారు. పులివెందుల మండలం తుమ్మలపల్లికి చెందిన విశ్వనాథరెడ్డి.. ఇటీవల బీటెక్ రవి సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ నేపథ్యంలో భాస్కర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి, ఎంపీ అవినాశ్‌రెడ్డి పీఏ రాఘవరెడ్డి, అదే గ్రామానికి చెందిన గంగాధర్‌రెడ్డి తదితరులు విశ్వనాథరెడ్డిని తీవ్ర స్థాయిలో బెదిరించినట్లు ఫోన్‌కాల్ డేటా ఆధారాలను కూడా విశ్వనాథ్‌రెడ్డి పులివెందుల పోలీసులకు అందజేశారు. వీరందరిపైనా పోలీసులు రెండు రోజుల క్రితం కేసు నమోదు చేశారు. అయితే, వివేకా హత్య కేసులో నిందితులుగా ఉన్న భాస్కర్ రెడ్డి, వివేకానందరెడ్డి హైదరాబాద్‌లోనే ఉండాలని కండిషన్ బెయిల్ ఉన్నందువల్ల.. పులివెందుల పోలీసులు అక్కడికి వెళ్లి 41 ఏ నోటీసులు అందజేశారు. రెండు మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు.