ఆంధ్రాలో బలోపేతం దిశగా.. ఆంధ్రప్రదేశ్లోనూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా అధిష్టానం సిద్ధమవుతోంది. ఏపీ విభజనతో కాంగ్రెస్ పార్టీకి బలం తగ్గింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ప్రజలకు మళ్లీ కాంగ్రెస్ దగ్గర అయ్యేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసే దిశగా అడుగులు వేస్తోంది.
వైసీపీలో ఉన్న ఎక్కువ మంది నేతలు గతంలో కాంగ్రెస్ పార్టీలో పని చేసినవారే. ఆ పార్టీ ఘోరంగా ఓటమిని చవిచూడటంతో కాంగ్రెస్ కు ఆశలు చిగురిస్తున్నాయి. ఇదే విషయాన్ని అధిష్టానం పెద్దల ముందు వైఎస్ షర్మిల, ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ సైతం ప్రస్తావించనున్నట్లుగా తెలుస్తోంది.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏపీకి అన్యాయం చేస్తోందని గళం ఎత్తేందుకు సిద్ధం అవుతోంది. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ స్టాండ్ తోపాటు, ఏపీలో తీసుకోవాల్సిన, పోరాడాల్సిన అంశాలు సైతం చర్చించనున్నట్లుగా సమాచారం. మరోవైపు.. జగన్ ఇండియా కూటమితో కలిసి నడవాలన్న వ్యూహంతో ఉండటంతో.. దీనిని కాంగ్రెస్ కు అనుకూలంగా మార్చుకోవాలని హైకమాండ్ స్కెచ్ గీస్తున్నట్టు తెలుస్తోంది.