RAINS: ఉత్తరాంధ్రను వణికించిన భారీ వర్షాలు
ఉత్తరాంధ్ర జిల్లాలకు రెడ్ అలర్ట్.. విశాఖ తీరం వెంబడి అల్లకల్లోలం... ఈదురుగాలులతో కూడిన వర్షం
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం పారాదీప్-గోపాలపూర్ మధ్య తీరం దాటింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. వర్ష బీభత్సంతో అనేక చోట్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి. చెట్లు నేలమట్టం అయి విద్యుత్ తీగలపై పడడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కొన్ని చోట్ల భారీ వృక్షాలు కూలి రహదారిపై పడడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో వర్ష బీభత్సానికి జన జీవనం అస్తవ్యస్తమైంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. విశాఖపట్నంలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. దీంతో పాటు భారీ వర్షం కురిసింది. ఈదురుగాలుల ధాటికి జీవీఎంసీ కార్యాలయం సమీపంలో భారీ వృక్షం కూలింది. పార్కింగ్‌లో ఉన్న లారీ, కారుపై చెట్టు పడింది. ఆకాశవాణి కేంద్రం వద్ద మరో చెట్టు కూలింది. అక్కయ్యపాలెం పరిధి శ్రీనివాసనగర్‌లో కారుపై రావిచెట్టు కూలడంతో ఓ ఇంటి గోడ పూర్తి కూలిపోయింది. 51వ వార్డు కళింగ నగర్ మెయిన్‌రోడ్డుపై పార్క్ చేసిన కారుపై చెట్టు కూలింది.
పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు, భారీ హోర్డింగ్స్ కుప్పకూలాయి. ద్వారకానగర్ రోడ్డులోని ఫార్చునర్ కారుపై చెట్టు కూలిపోయింది. కారు పార్క్ చేసి.. ఓనర్ షాపింగ్‌కు వెళ్లడంతో ప్రమాదం తప్పింది. ఎక్కడికక్కడ భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఏయూ, శంకరమఠం, సత్యం జంక్షన్, బీవీకే కాలేజీ రోడ్లలో చెట్లు విరిగిపడ్డాయి. వాయుగుండం ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం,మన్యం,అల్లూరి, విశాఖ,అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడుతున్నాయి. కాకినాడ,కోనసీమ, తూర్పుగోదావరి,పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి-మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, అల్లూరి, అనకాపల్లి జిల్లాల్లో కొన్నిప్రాంతాల్లో భారీ వర్షాలు పడొచ్చని… అక్కడక్కడ అతిభారీ వర్షాలు పడుతాయని అంచనా వేసింది. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది. దక్షిణ కోస్తాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే సూచనలున్నాయి. తీర ప్రాంతాల వెంబడి ప్రయాణాలు చేయవద్దని అధికారులు సూచించారు. ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని పేర్కొన్నారు. జాగ్రత్తలు తీసుకోవాలని… అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.