ఏపీ మాజీ మంత్రి విడదల రజనీ అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. సొంత పార్టీ నేతల కోసం జగన్ ఏర్పాటు చేసిన వైసీపీ డిజిటల్ బుక్‌లో షాకింగ్ ఫిర్యాదులు వస్తున్నాయి. సొంత పార్టీ నేతలపైనే వరుసగా కంప్లయింట్లు రావడంతో జగన్ ముక్కున వేలేసుకుంటున్నారు. ఇన్ని రోజులు బయట పార్టీలపై ఆరోపణలు చేసిన జగన్ కు.. ఇప్పుడు సొంత పార్టీ కార్యకర్తలపైనే వైసీపీ నేతలు ఏ స్థాయి అవినీతికి పాల్పడ్డారో తెలిపే ఫిర్యాదులు బయటకొస్తున్నాయి. మాజీ మంత్రి విడుదల రజినీకి మరో షాక్ తగిలింది. ఇప్పటికే ఆమెపై చిలకలూరిపేటకే చెందిన నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం ఆదివారం నాడు డిజిటల్ బుక్ లో ఫిర్యాదు చేశారు.
‘2022లో పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని నవతరం పార్టీ ఆఫీసుతో పాటు, తన ఇల్లు, కారుపై మాజీ మంత్రి విడదల రజినీ దాడి చేయించారని ఆయన కంప్లయింట్ చేశారు. ఇప్పుడు ఆమెపై మరో ఫిర్యాదు నమోదైంది. చిలకలూరిపేట మండలం పోతవరం సర్పంచ్, వైసీపీ నేత అయిన భాషా ఫిర్యాదు చేశాడు. ఎన్నికలకు ముందు రజినీ తన దగ్గరి నుంచి రూ.5లక్షలు తీసుకున్నారంటూ భాషా ఫిర్యాదు చేశాడు. డబ్బులు అడిగితే తిరిగి ఇవ్వలేదని.. చేసేది లేక చివరకు జగన్ వద్దకు వెళితే తనను పార్టీ నుంచి రజినీ సస్పెండ్ చేయించిందంటూ వాపోయాడు. తనకు న్యాయం చేయాలని డిజిటల్ బుక్ లో కోరాడు.
రజినీపై ఇది రెండో ఫిర్యాదు. అటు వైసీపీ నేత తిప్పేస్వామిపై వరుసగా ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. జగన్ ఒకటి తలిస్తే ఇక్కడ మరొకటి జరుగుతోంది. కూటమి నేతలపై ఫిర్యాదులు చేసేందుకు ఆయన ఈ డిజిటల్ బుక్ ప్రారంభిస్తే.. సొంత పార్టీ నేతలపైనే ఎక్కువ ఫిర్యాదులు రావడంతో దిమ్మతిరిగిపోతోంది. సొంత పార్టీ నేతలు ఏ స్థాయిలో అక్రమాలు చేశారో ఈ ఫిర్యాదులే చెబుతున్నాయి జగన్ కు. మరి ఇన్ని ఫిర్యాదులు వస్తున్నందుకు అయినా జగన్ వారి మీద యాక్షన్ తీసుకుంటారా అంటే అనుమానమే. ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని అక్రమాలు చేసినా పార్టీ నేతలను వెనకేసుకు రావడం ఆయనకు అలవాటే కదా అంటున్నారు ఫిర్యాదులు చేస్తున్న బాధితులు.