RAMMOHAN NAIDU: వచ్చే ఏడాది నుంచే విమాన వైభోగం
2026 నుంచే భోగాపురం నుంచి విమానాలు..వర్షాలు కురుస్తున్న ముమ్మరంగా పనులు...86 శాతం ఎయిర్‌పోర్టు నిర్మాణం పూర్తి.
విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించతలపెట్టిన గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం పనులు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయి. నిర్ణీత లక్ష్యానికంటే ముందుగానే పనులు పూర్తిచేసే దిశగా పౌర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పనులను పరుగులు పెట్టిస్తున్నారు. పనుల పురోగతిపై సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఈ విమానాశ్రయ నిర్మాణంలో మొత్తం 5,050 మంది కార్మికులు, సిబ్బంది, ఇంజనీర్లు నిమగ్నమయ్యారు. వచ్చే ఏడాది జూన్‌నాటికి విమానాశ్రయాన్ని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలనేది లక్ష్యం.
పనులు పరిశీలించిన మంత్రి
భోగాపురం ఎయిర్‌పోర్టు నుంచి విమాన సర్వీసులు 2026 జూన్‌లో ప్రారంభమవుతాయని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్నాయుడు అన్నారు. విమానాశ్రయ నిర్మాణ పనులను శనివారం ఆయన పరిశీలించారు. పనుల పురోగతి, పూర్తికావాల్సిన నిర్మాణాలు, తదితర అంశాలపై నిర్మాణ సంస్థ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్ని సవాళ్లు ఎదురైనా జీఎంఆర్ సంస్థ పనులు ఆపడం లేదన్నారు. ఓ వైపు వర్షాలు కురుస్తున్నా ఎయిర్‌పోర్టు నిర్మాణ పనులు మాత్రం కొనసాగుతున్నాయని చెప్పారు. ఇప్పటి వరకు 86 శాతం ఎయిర్‌పోర్టు నిర్మాణం పూర్తయిందని చెప్పారు. విశాఖ నుంచి రోడ్డు కనెక్టివిటీకి సంబంధించి అనేక సార్లు సమీక్షలు నిర్వహించామన్నారు. మొత్తం 7 పాయింట్లు గుర్తించామని చెప్పారు. 2019, ఫిబ్రవరి 14న అప్పటి సీఎం చంద్రబాబు భోగాపురం విమానాశ్రయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ప్రాథమిక పనులు చేపడుతుండగా.. రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగి వైసీపీ పగ్గాలు చేపట్టింది.
మార్చిలోగా పూర్తి చేస్తాం
‘‘మార్చి, ఏప్రిల్‌లోగా ఈ రహదారి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. శ ఎలివేటెడ్ కారిడార్ కూడా ప్రతిపాదనలో ఉంది. బీచ్ కారిడార్ నిర్మాణం కోసం కూడా డీపీఆర్ సిద్ధం చేస్తున్నాం. విశాఖ నుంచి కొచ్చికి కనెక్టివిటీ కోసం వినతులు వచ్చాయి. విశాఖ నుంచి అంతర్జాతీయ కనెక్టివిటీ పెంచేందుకు దృష్టి సారించాం.’’ అని రామ్మోహన్ నాయుడు తెలిపారు.
జగన్ శంకుస్థాపన చేసినా...
2023, మే 3న ఎయిర్‌పోర్టు నిర్మాణానికి జగన్ మరోసారి శంకుస్థాపన చేసినా పనుల్లో ఆశించిన పురోగతి లేదు. కేవలం 15 నుంచి 18శాతం మాత్రమే పనులు చేయగలిగింది. 2024, జూన్‌లో ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చింది. వచ్చాక ఏపీలో తొలి ప్రాధాన్య ప్రాజెక్టుగా భోగాపురం విమానాశ్రాయం పనులను పరుగులు పెట్టించాలని నిర్ణయించారు. విమానాశ్రయానికి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టారు. ఎంపీ రామ్మోహన్నాయుడు నిరంతరం పర్యవేక్షిస్తూ.. ప్రతి 15రోజులకు ఒకసారి సందర్శించి పురోగతిని తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం ఎయిర్‌పోర్టుకు సంబంధించి 2,200 ఎకరాల్లో పనులు చురుగ్గా జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తన పరిధిలోని 500 ఎకరాలను పర్యాటక, ఇతరత్రా అవసరాల కోసం వినియోగించాలని భావిస్తోంది. విమానాశ్రయ నిర్మాణ పనులు చేపట్టిన జీఎంఆర్ సంస్థ అధినేత గ్రంధి మల్లికార్జునరావు స్వస్థలం విజయనగరం కావడంతో మరింత అంకితభావంతో పనులు చేపడుతున్నారు. ఇప్పటివరకు 86 శాతం పనులు పూర్తి చేశారు.
భోగాపురం విమానాశ్రయాన్ని ఉత్తరాంధ్రలోని అన్ని జిల్లాలకు అనుసంధానించేలా పనులు చేపడుతున్నారు. అనకాపల్లి, విజయనగరం జిల్లాల మీదుగా వెళ్లే అరకు ప్రధాన రహదారి, విజయనగరం మీదుగా పార్వతీపురం మన్యం జిల్లాకు వెళ్లే అన్ని ప్రధాన రహదారులను కలుపుతున్నారు. వీటితో పాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్ వెళ్లే జాతీయ రహదారులను సైతం అనుసంధానం చేస్తున్నారు.