RATHA SAPTHAMI:అంగరంగ వైభవంగా రథసప్తమి వేడుకలు
అరసవల్లిలో రథసప్తమి వేడుకలు
నేడు రథసప్తమి పురస్కరించుకుని అరసవల్లిలో రథసప్తమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. అర్ధరాత్రి 12.30 గంటల నుంచే దేవస్థానంలో క్షీరాభిషేక సేవ ఆరంభమైంది. అర్చకులు వేదమంత్రాలు, మంగళవాయ్యిదాల నడుమ క్షీరాభిషేకాన్ని కనుల పండువగా నిర్వహించారు. స్వామివారి నిజరూపం దర్శనం చేసుకునేందుకు భక్తులు పొటెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్వామికి పట్టువస్త్రాలు సమర్పించారు.
ఈరోజు మాంసాహారం తినొచ్చా?
నేడు రథసప్తమి సందర్భంగా మాంసాహారం తినకపోవటమే మంచిదని పండితులు చెబుతున్నారు. సూర్యోదయానికి ముందే స్నానమాచరించి, ఆలయానికి వెళ్లి దైవనామ స్మరణలో గడపాలి. సూర్యాష్టకం, ఆదిత్యహృదయం చదవాలి. పరమాన్నం తయారు చేసి చిక్కుడు కాయలతో రథం చేసి చిక్కుడాకులపై ఉంచి దేవుడికి నైవేద్యం సమర్పించాలి. సూర్యనమస్కారాలు చేసి సాత్వికాహారం భుజించాలి. ఆధ్యాత్మిక చింతనతో శరీరం, మనసు శుద్ధి అవుతుంది. దైవానుగ్రహం పొందుతారు.
సూర్యుడికి అర్ఘ్యం, జిల్లేడు ఆకులతో స్నానం ఎందుకంటే
సూర్యుడు ఆరోగ్య ప్రదాత. ఈయనకు అర్ష్యం ఇచ్చే సమయంలో నీటి ధార గుండా సూర్య కిరణాలు ప్రసరించినప్పుడు, అవి 7 రంగులుగా విడిపోయి శరీరంలోని 7 చక్రాలపై ప్రభావం చూపుతాయి. అర్ఘ్యం వదిలేటప్పుడు ఓం సూర్యాయ నమః, ఓం ఆదిత్యాయ నమః మంత్రాలను పఠించాలి. అలాగే జిల్లేడు ఆకులతో స్నానం చేస్తే శరీరంలో వేడి తగ్గించి, టాక్సిన్‌ను గ్రహిస్తుంది. జుట్టు రాలకుండా చేస్తుంది. గాయాలని తగ్గించే గుణాలు ఈ ఆకుల్లో ఉన్నాయి.