Ration Rice: మాయం అవుతున్న వందల బస్తాల రేషన్ బియ్యం.. బ్లాక్ మార్కెట్ దందా
Ration Rice: రేషన్ బియ్యం అక్రమ తరలింపును టీవీ5 ఎక్స్‌క్లూజీవ్‌గా చిత్రీకరించింది.;
Ration Rice: కడపజిల్లాల్లో రేషన్ బియ్యం పక్కదారి పడుతోంది. బడుగు జీవుల ఆకలి తీర్చే రేషన్ బియ్యం యథేచ్ఛగా బ్లాక్‌మార్కెట్‌కు తరలిపోతోంది. పౌరసరఫరాలశాఖలో ఉన్న దొంగలు పట్టపగలే బియ్యాన్ని దోచేస్తున్నారు. కడపలో సివిల్ సప్లై రైల్వే వ్యాగన్ల నుంచి వేర్‌హౌస్ స్టాక్ పాయింట్‌కు వెళ్తున్న రేషన్ బియ్యం దారిలోనే పక్కకు వెళ్లిపోతోంది. హ్యాండ్లింగ్ అండ్ ట్రాన్స్‌పోర్టేషన్ కాంట్రాక్టర్లు దర్జాగా ఈ దందాను నడుపుతున్నారు.
లారీ నెంబర్ AP04 V 5461.. ఇది ట్రాన్స్‌పోర్టేషన్ కాంట్రాక్టర్ రఘునాథరెడ్డికి చెందిన లారీ. ఉదయం కడప సివిల్ సప్లై పాయింట్ నుంచి 430 బస్తాలతో పొద్దులూరులోని వేర్‌హౌస్ గిడ్డంగుల స్టాక్ పాయింట్‌కు బయల్దేరుతుంది ఈ లారీ. మార్గంమధ్యలో మైదుకూరు హైవేపై లారీని ఆపుతున్నరేషన్ మాఫియా.. లారీని ముళ్లపొదల్లోకి తీసుకెళ్లి సివిల్ సప్లై బియ్యం బస్తాలను దర్జాగా దోచేస్తున్నారు. పట్టగలే బరితెగిస్తున్న ఈ బ్లాక్ మార్కెట్ మాఫియా.. పేదలకు చేరాల్సిన బియ్యాన్ని బ్లాక్ మార్కెట్‌లో అమ్ముకుంటోంది.
రేషన్ బియ్యం అక్రమ తరలింపును టీవీ5 ఎక్స్‌క్లూజీవ్‌గా చిత్రీకరించింది. దీంతో ముగ్గురు బ్లాక్ మార్కెట్ దొంగలు పరగు లంకించుకోగా.. లారీ డ్రైవర్ లబోదిబోమన్నాడు. మార్గం మధ్యలో మాయమవుతున్న రేషన్ బియ్యంపై అధికారులు నోరు విప్పడం లేదు. తిలా పాపం తలా పిడికెడు అన్నట్లు మాయమవుతున్న రేషన్ బియ్యం రికార్డులను మసిపూసి మారేడుకాయ చేస్తున్నారు.