Rayalaseema Floods: వరదల తాకిడికి కుప్పకూలిపోయిన గుళ్లు, బడులు.. కొట్టుకుపోయిన మూగజీవాలు..

Rayalaseema Floods: రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో ఎటు చూసినా హృదయవిదారక దృశ్యాలే కనిపిస్తున్నాయి.

Update: 2021-11-22 04:00 GMT

Rayalaseema Floods (tv5news.in)

Rayalaseema Floods: రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో ఎటు చూసినా హృదయవిదారక దృశ్యాలే కనిపిస్తున్నాయి. వరదలో గల్లంతై ప్రాణాలతో వెనక్కి వచ్చిన వారికి తమ ఇళ్లు ఎక్కడుందో గుర్తుపట్టలేనంత పరిస్థితి నెలకొంది. పిల్లా పాపలు, పశువులతో కళకళలాడిన ఇల్లు వాకిలి నామరూపాల్లేకుండా పోవడంతో ఒక్కొక్కరు గుండెలు బాదుకుంటున్నారు. వీధుల్లో అడుగుపెడుతుంటే నడుము లోతుకు దిగుతున్న బురద, ఎక్కడ చూసినా ఇసుక మేటలే స్వాగతం పలుకుతున్నాయి.

కొత్తగా కట్టుకున్న ఇళ్లు సైతం వరద ధాటికి ధ్వంసమయ్యాయి. ఇక పాత ఇళ్ల సంగతి సరే సరి. గుడి, బడి అన్నీ వరదల తాకిడికి కుప్పకూలిపోయాయి. ఇప్పటికీ తాగడానికి గుక్కెడు నీళ్లు కూడా దొరకని గ్రామాలు ఎన్నో ఉన్నాయి. ఒక్క బ్రెడ్డు, ఒక్క బిస్కెట్ ప్యాకెట్ కోసం ఆశగా చూస్తున్న వాళ్లూ ఉన్నారు.

వరదలకు గల్లంతైన తమ వారు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని ఎక్కడో ఒక చోట బతికే ఉంటారని వెతుక్కుంటున్నారు. కాని, చెట్టుకొకరు, పుట్టకొకరు అన్నట్టుగా శవాలు తేలియాడుతూ కనిపిస్తుండడంతో ఒక్కొక్కరి గుండె చెరువవుతోంది. చెట్ల కొమ్మలకు ఇరుక్కుపోయి, వీధుల్లో, ఇసుక మేటల్లో చిక్కుకుపోయిన మృతదేహాలు కనిపిస్తుండడంతో.. అది తమ వారి మృతదేహం కాకూడదన్న ఆశతో వెళ్లి చూసుకుంటున్న వాళ్లున్నారు.

ఇక మూగజీవాల పరిస్థితి చెప్పక్కర్లేదు. చనిపోయినా తల్లి దగ్గర.. పాల కోసం పొదుగును తన్నుతున్న దూడలు, ఎవరైనా కట్టు విడిపించి కాపాడకపోతారా అని వాకిలి ముందే తలవాల్చి నేలకొరిగిన ఆవులు.. ఇలా లెక్కలేనన్ని ఆవులు, గేదెలు, మేకలు వరదలకు కొట్టుకుపోయి కళేబరాలుగా మిగిలాయి.

Tags:    

Similar News