AP New Cabinet : ఏపీ కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధం.. మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్న ఆశావహులు

AP New Cabinet : ఏపీలో జగన్ సర్కారు అప్పుడే ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఎన్నికలకు ఇంకా రెండేళ్లు సమయం ఉన్నా.. ఇప్పటి నుంచే సీఎం జగన్ గ్రౌండ్‌వర్క్ రెడీ చేసుకుంటున్నారు.

Update: 2022-03-12 08:24 GMT

AP New Cabinet : ఏపీలో జగన్ సర్కారు అప్పుడే ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఎన్నికలకు ఇంకా రెండేళ్లు సమయం ఉన్నా.. ఇప్పటి నుంచే సీఎం జగన్ గ్రౌండ్‌వర్క్ రెడీ చేసుకుంటున్నారు. ఈ మేరకు త్వరలో కేబినేట్ విస్తరణ, ఈనెల 15న వైసీపీఎల్పీ సమావేశానికి రంగం సిద్ధం చేస్తున్నారు. గురువారం మంత్రివర్గ సమావేశం నిర్వహించిన సీఎం జగన్.. కేబినెట్ విస్తరణపై మంత్రులకు క్లారిటీ ఇచ్చారు. మంత్రివర్గం నుంచి తప్పించిన వారు పార్టీకి పని చేయాలని తేల్చిచెప్పారు. పదవుల నుంచి తప్పించిన వారికి జిల్లా ఇంచార్జ్ బాధ్యతలను అప్పగించనున్నట్లు తెలిపారు. మొత్తం మంత్రులను మారుస్తారని ప్రచారం జరిగినా.. కొందరిని మాత్రమే కంటిన్యూ చేస్తున్నట్టు సీఎం జగన్‌ స్పష్టంచేశారు. దీంతో కొత్త కేబినేట్‌లో ఎవరెవరు ఉంటారు.? ఎవరికి ఉద్వాసన పలకబోతున్నారన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

మంత్రులుగా కొనసాగేవారి లిస్టులో నలుగురైదుగురి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. వీరిలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని, పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నానితో పాటు ఆర్థిక మంత్రి బుగ్గన పేర్లు ఉన్నాయి. ఇదే సమయంలో పలు జిల్లాల నుంచి మంత్రి పదవులు ఆశిస్తున్న ఆశావహుల సంఖ్య అధికంగానే ఉనట్టు తెలుస్తోంది.

కర్నూలు జిల్లా నుంచి ఆర్థర్, బాలనాగి రెడ్డి, సాయి ప్రసాద్ రెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డి ఉండగా.. అనంతపురం జిల్లా నుంచి ఉషాశ్రీ చరణ్, జొన్నలగడ్డ పద్మావతి, అనంత వెంకట్రామి రెడ్డి, కాపు రామచంద్రబారెడ్డి ఉన్నారు. ఇక కడప నుంచి శ్రీకాంత్ రెడ్డి, కోరుముట్ల శ్రీనివాసులు... చిత్తూరు జిల్లా నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, రోజా ఉన్నారు. అలాగే గుంటూరు జిల్లా నుంచి ముస్తాఫా, మర్రి రాజశేఖర్, విడదల రజిని, అంబటి రాంబాబు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి ఉండగా.. కృష్ణా జిల్లా నుంచి సామినేని ఉదయభాను, మల్లాది విష్ణు, పార్థసారథి, జోగి రమేష్ పేర్లు వినిపిస్తున్నాయి.

తూర్పుగోదావరి జిల్లా నుంచి కొండేటి చిట్టిబాబు, పొన్నడా సతీశ్, జక్కంపూడి రాజా, దాడిశెట్టి రాజా.. విశాఖ జిల్లా నుంచి ముత్యాలనాయుడు, కరణం ధర్మశ్రీ, గుడివాడ అమర్నాథ్ ఉన్నారు. శ్రీకాకుళం నుంచి ధర్మాన ప్రసాద్, శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రస్తుతం స్పీకర్‌గా ఉన్న తమ్మినేని సీతారాం కూడా మంత్రి పదవుల ఆశిస్తున్న ఆశావహుల లిస్టులో ఉన్నారని సమాచారం.

మరోవైపు ఎవరి పదవులు ఉంటాయి. ఎవరి పదవులు ఊడతాయన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే ఏడాదిన్నర క్రితం కేబినెట్‌లోకి వచ్చిన మంత్రులు సీదిరి అప్పలరాజు, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణను కొనసాగిస్తారా.. లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. ఈనెల 15న జరిగే వైసీపీఎల్పీ భేటీ సమావేశంలో ఏపీ మంత్రివర్గ విస్తరణతో పాటు ఎన్నికల వ్యూహాలపై పార్టీ నేతలకు జగన్.. పూర్తిగా వివరించే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి సీఎం మనసులో ఎవరున్నారు..? ప్రొగ్రెస్ రిపోర్టుల్లో ప్రస్తుత మంత్రుల్లో ఎవరికి ఎక్కువ మార్కులొచ్చాయి..? రెండోదశ కేబినెట్‌ విస్తరణలో ఎవరెవరికి మంత్రి పదవులు దక్కుతాయనేది చూడాలి.

Tags:    

Similar News