ACCIDENTS: నెత్తురోడిన రోడ్లు
ఏపీలో వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు మృతి.. తొమ్మిదిమందికి గాయాలు;
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఘోర రోడ్డు ప్రమాదాల్లో రహదారులు నెత్తురోడాయి. వేర్వేరు ఘనటనల్లో ఆరుగురు మరణించగా తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. తెల్లవారు జామున జరిగిన ఘటనల్లో బాధితుల ఆర్తనాదాలు మిన్నంటాయి.
హైదరాబాద్ నుంచి బెంగుళూరు వైపు వెళ్తున్న కారు అనంతపురం జిల్లా బాచుపల్లి వద్ద లారీని ఢీకొట్టింది. అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందగా...మరో ఇద్దరు చికిత్స పొందుతూ మరణించారు. మరో ఇద్దరు క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కారు డ్రైవర్ నిద్ర మత్తే ప్రమాదానికి కారణమని స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. మృతులు అనంతపురం రాణినగర్ కు చెందిన మహ్మద్ అయాన్, మహ్మద్ అమాన్, షేక్ ఫిరోజ్ , ఆలి సాహెబ్ , రెహానా గా గుర్తించారు.
నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం జాతీయ రాహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొనటంతో డ్రైవర్ తో సహా ఏడుగురికి గాయాలయ్యాయి. చికిత్స పొందుతున్న వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. బాపట్ల కాజుపాలెంకు చెందిన వీరంతా బ్రహ్మంగారిమఠం, ఒంటిమిట్ట రామాలయానికి వెళ్లి దైవదర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. క్షతగాత్రులకు మెడికల్ విద్యార్థి సుకన్య ప్రాథమిక చికిత్స అందించి 108 అంబులెన్సులో ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న కొడవలూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
YSR జిల్లాలో ఓ ఇంట్లోకి సిమెంటు లోడ్ లారీ దూసుకెళ్లింది. శుక్రవారం రాత్రి ముద్దనూరు వైపు వెళ్తున్న లారీ...బ్రేక్ ఫెయిలై... రైల్వే గేటు సమీపంలోని ఇంట్లోకి దూసుకెళ్లింది. అప్పటివరకు ఆ ఇంటి ఆవరణలో ఉన్న మహిళ ....రైల్వే గేటు ధ్వంసం శబ్ధం విని లోపలికి వెళ్లిపోవటంతో.... ప్రాణాపాయం తప్పింది. ఇంట్లోకి లారీ దూసుకెళ్లిన దృశ్యాలు సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యాయి.