మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత ఆర్కే రోజా చేసిన తీవ్ర వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి దుమారం రేపుతున్నాయి. ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లపై ఆమె చేసిన విమర్శలు అధికార పార్టీ నేతలను ఆగ్రహానికి గురిచేశాయి. రాయలసీమకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనే విషయాన్ని అసెంబ్లీలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారని రోజా పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఉన్న తమ ఆస్తులను కాపాడుకోవడం కోసం రాయలసీమ భవిష్యత్తును తాకట్టు పెడతారా? అంటూ చంద్రబాబును ఆమె ప్రశ్నించారు. రాయలసీమలో పుట్టిన పవన్ కళ్యాణ్, ఇప్పుడు అదే ప్రాంతానికి అన్యాయం జరుగుతుంటే ఎందుకు ప్రశ్నించడం లేదని ఆమె నిలదీశారు.
రోజా అవే తిట్లు
డబ్బా కొట్టుకువచ్చిన పవన్ కళ్యాణ్, రాయలసీమ సమస్యలపై మౌనం వహించడాన్ని ప్రజలు గమనిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ప్రస్తుతం పోలీసు వ్యవస్థను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని వ్యాఖ్యానించారు. దీనికి ఏపీ పోలీసులు సిగ్గుపడాలని ఘాటుగా విమర్శించారు. దేశంలోనే అత్యంత దిగువ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ ఉందని రోజా ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన నివేదికను చూసైనా సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనిత సిగ్గుపడాలని అన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి మాజీ సీఎం జగన్ ప్రభుత్వం రూ.960 కోట్లతో పనులు చేపట్టితే, వాటిని ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం నిలిపివేసి చూస్తోందని ఆరోపించారు.