ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మరోసారి సంచలన నిర్ణయం
వారికి మరో అవకాశం ఇస్తామన్నారు. ఈమేరకు రిటర్నింగ్ అధికారులు, ఎన్నికల అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.;
ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో గతంలో బలవంతపు ఉపసంహరణలు జరిగిన చోట చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. గతంలో జరిగిన బలవంతపు నామినేషన్ల ఉపసంహరణపై ఫిర్యాదులు వస్తే స్వీకరిస్తామని.. అలాంటి వారికి మరో అవకాశం ఇస్తామన్నారు. ఈమేరకు రిటర్నింగ్ అధికారులు, ఎన్నికల అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
గతేడాది నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా చాలా చోట్ల విపక్షాల అభ్యర్థులతో బలవంతంగా నామినేషన్లను ఉపసంహరింపజేశారనే ఆరోపణలు వచ్చాయి. నామినేషన్లు వేయకుండా అడ్డుకున్న సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. దీంతో మొత్తం ఎన్నికల ప్రక్రియను మొదటి నుంచి ప్రారంభించాలని పలు పార్టీలు ఎస్ఈసీని కమిషన్‌ను కోరాయి. ఈ నేపథ్యంలో నిమ్మగడ్డ కీలక ఆదేశాలు జారీ చేశారు. బలవంతంగా నామినేషన్లు ఉపసంహరించేలా చేశారని.. ఎవరైనా రిటర్నింగ్ అధికారికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే.. వారి అభ్యర్థిత్వాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశించారు.
అయితే ఎవరు పడితే వారు ఫిర్యాదుచేస్తే కుదరదు. అప్పుడు తమను నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారని.. ఎన్నికల అధికారికిగానీ, పోలీసులకుగానీ ఫిర్యాదు చేసి ఉండాలి. లేదా దౌర్జన్యాలకు సంబంధించి మీడియాలో ప్రముఖంగా వార్తలు వచ్చి ఉండాలి. అలాంటి వారికి మాత్రమే ఇప్పుడు కొత్తగా నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఇవ్వాలని ఉన్నట్లు తెలుస్తోంది.
మరోవైపు సీఎం జగన్ సొంత నియోజకవర్గం కడప జిల్లా పులివెందులలో 33 వార్డులకుగాను 21, రాయచోటిలో 34 వార్డులకు గాను 21 వార్డుల్లో ఒక్కరే బరిలో ఉన్నారు. ఇక మంత్రి పెద్దిరెడ్డి నియోజకవర్గమైన చిత్తూరు జిల్లా పుంగనూరులో 31 వార్డులకు.. 16 వార్డుల్లో సింగిల్ నామినేషన్లు దాఖలయ్యాయి. గుంటూరు జిల్లా మాచర్లలో 31 వార్డులకుగాను 10చోట్ల.. పలమనేరులోని 26 వార్డుల్లో 10చోట్ల ఒక్కరే బరిలో ఉన్నారు. తిరుపతి కార్పొరేషన్‌లో 50 డివిజన్లు ఉండగా... ఆరుచోట్ల ఒకే నామినేషన్ దాఖలైంది. దీంతో వీటిపై ఈ నెల 20లోగా నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్లను ఎస్ఈసీ ఆదేశించారు.
మున్సిపల్ ఎన్నికల్లో ఆశావహులు నామినేషన్లు దాఖలు చేసేందుకు రెండు రోజులు అవకాశం కల్పించాలని టీడీపీ నేతలు ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. ఆగిన చోట నుంచే నోటిఫికేషన్ ఇవ్వడం సరికాదని తెలిపారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు స్వేచ్ఛగా, ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చూడాలని వినతిపత్రం అందజేశారు.