MLA Vemireddy Prashanthi Reddy : రైతులకు అండగా ఉండండి : ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
రైతులకు అవసరమైన పంట రుణాలు, విత్తనాలు, ఎరువులు, సాంకేతిక సలహాలు, మార్కెట్ సౌకర్యాలు కల్పించడంలో వ్యవసాయ సహకార సంఘాలు ముఖ్య భూమిక పోషించాలని కోరారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. కొడవలూరు మండలం రాజుపాళెం గ్రామంలో జరిగిన తలమంచి, గుండాలమ్మ పాళెం, యల్లాయ పాళెం సొసైటీ ఛైర్మెన్లు మరియు డైరెక్టర్లు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమంచి ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం ఛైర్మన్ గా పిట్టి సూర్య నారాయణ డైరెక్టర్లుగా నక్కల రవి, కె నాగేశ్వర రావు. గుండాలమ్మ పాళెం ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం ఛైర్మన్ గా బద్వేలు వినీల్ రెడ్డి డైరెక్టర్లుగా పి శ్రీనివాసులు, పి సాయి మోహన్ రెడ్డి. యల్లాయపాళెం ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం ఛైర్మన్ గా ఏకొల్లు వంశీ రెడ్డి డైరెక్టర్లు గా ఎం వెంకటేశ్వర్లు, బి చిట్టిబాబులచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి వ్యవసాయ సహకార సంఘ బాధ్యతలు స్వీకరించిన నాయకులకు శుభాకాంక్షలు అందచేశారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ బాధ్యతాయుతంగా పని చేస్తూ పదవులకు వన్నె తేవాలని వ్యవసాయ సహకార సంఘాల పాలక మండలి చైర్మెన్లు డైరెక్టర్లుగా పదవీ బాధ్యతలు స్వీకరించిన నాయకులకు హితవు పలికారు. సహకారం అంటేనే సహాయం, రైతులతో మమేకమై వ్యవసాయ పై ఆధారపడి వున్న అన్నదాతలకు సహాయ పడడమే సహకార సంఘ పాలక వర్గాల లక్ష్యం కావాలని కోరారు. కూటమి ప్రభుత్వ పాలనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయ రంగానికి ఇస్తున్న ప్రోత్సాహకాలను ఆమె వివరించారు. అన్నదాతల పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడమే కాకుండా పంట సేకరణ చేసిన 24 గంటలలో రైతుల ఖాతాలలో హమాలీ కూలీలతో సహా డబ్బులు చెల్లించి రైతులను ఆదుకుంటున్న విషయాన్ని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి 42 వేల 340 కోట్లు కేటాయించి రైతు పక్షపాతి అని నిరూపించుకున్నారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని స్ఫూర్తిగా తీసుకొని మీరు కూడా మన రైతన్నలు అధిక దిగుబడులు సాధించేలా ఆధునిక సాంకేతిక వ్యవసాయ పద్ధతుల గురించి అన్నదాతలకు అవగాహన కల్పించడంలో చొరవ చూపాలని కొత్తగా బాధ్యతలు చేపట్టిన సొసైటీ ఛైర్మెన్లు మరియు డైరెక్టర్లకు సూచించారు.