అమరావతికి రాష్ట్రమంతా సంఘీభావం.. నేడు JAC జెండా ఆవిష్కరణ
అసెంబ్లీ సాక్షిగా సీఎం జగన్ మూడు రాజధానులపై చేసిన ప్రకటనతో అమరావతి ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. 29 గ్రామాల ప్రజలూ భగ్గుమన్నారు. సర్కారు తీరుని ఎండగట్టారు..;
అసెంబ్లీ సాక్షిగా సీఎం జగన్ మూడు రాజధానులపై చేసిన ప్రకటనతో అమరావతి ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. 29 గ్రామాల ప్రజలూ భగ్గుమన్నారు. సర్కారు తీరుని ఎండగట్టారు. క్రమంగా రాజధాని ఉద్యమం రాష్ట్రమంతా వ్యాపించింది. రైతులకు 13 జిల్లాల ప్రజలు బాసటగా నిలిచారు. ఈ ఏడాది జనవరిలో దుర్గ గుడికి పాదయాత్ర, అసెంబ్లీ ముట్టడి, ట్రాక్టర్ల, కాగడాల ర్యాలీలు వంటి పలు వినూత్న కార్యక్రమాలు, నిరసనలతో ఉద్యమం తారస్థాయికి చేరింది. ఓ వైపు పోలీసుల నిర్బంధం, కేసులు... మరోవైపు ప్రభుత్వ పెద్దల ప్రకటనలతో రైతులపై రోజుకో రకంగా పిడుగులు పడుతున్నా ఆత్మస్థైర్యంతో అమరావతి ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. 300 రోజులుగా అలుపెరగని పోరాటం చేస్తున్నారు. ప్రపంచ చరిత్రలో నిలిచి పోయే మరో సుదీర్ఘపోరాటానికి నాంది పలికారు.. ఉద్యమం 300వ రోజుకు చేరిన సందర్భంగా ప్రత్యేక కార్యాచరణ ప్రకటించింది. ఉదయం 9 గంటలకు 29 గ్రామాలలోని దీక్షా శిబిరాల్లో JAC జెండాను ఆవిష్కరిస్తారు.ఆ తరువాత అమరావతి పరిరక్షణ మహోద్యమంలో అమరులైన 92 మంది అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించి.. ఉద్యమ నినాదాలతో హోరెత్తించనున్నారు. ఉదయం 10.30 గంటలకు ప్రతి శిబిరం నుండి 100 మంది తుళ్లూరు శిబిరంనకు చేరుకొని అక్కడ నిర్వహించే వినూత్నమైన నిరసన ప్రదర్శనలో పాల్గొంటారు.
అన్ని దీక్షా శిబిరాల్లోనూ సకలజనుల నిరసన ప్రదర్శనలను చేపట్టనున్నారు. శిబిరం ముందు నిలిపిన ట్రాక్టర్ ట్రాలీల మీద, ఎడ్ల బండ్ల మీద వినూత్నంగా నిరసన వ్యక్తం చేయాలని నిర్ణయించారు. ఒక ట్రాక్టర్ ట్రాలీ మీద నాలుగు ఉరి కొయ్యలను ఏర్పాటు చేసి "అమరావతి నిర్వీర్యం - రాజధాని ప్రజల మరణశాసనం" అనే సందేశముతో కూడిన నిరసన ప్రదర్శన....మరొక ట్రాలీ మీద న్యాయ దేవతకు పాలాభిషేకం వంటి కార్యక్రమాలు చేపట్టనున్నారు. మహిళలు మరియు పిల్లలు న్యాయాన్ని ఆర్ధిస్తూ ప్రదర్శన చేస్తారు. చేతి వృత్తుల వారితోనూ నిరసన కార్యక్రమం చేపట్టనున్నారు... ఇక సాయంత్రం ఆరున్నర నుంచి రాత్రి 8 గంటల వరకు అన్ని గ్రామాల్లో కాగడాల ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాలలో ప్రజలందరూ కోవిడ్-19 నిబంధనలను పాటిస్తూ పెద్ద ఎత్తున పాల్గొనలాలని జేఏసీ పిలుపునిచ్చింది. రాజధాని గ్రామాల్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటించనున్నారు. రైతులతో కలిసి 300వ రోజు ఉద్యమంలో పాల్గొంటారు. పెనుమాక, ఎర్రబాలెం, కృష్ణాయపాలెం,వెంకటపాలెం, తుళ్లూరు, దొండపాడు, అనంతవరంలో లోకేష్ పర్యటిస్తారు.