STEEL PLANT: రూ.16,350 కోట్ల పెట్టుబడితో కడపలో స్టీల్ ప్లాంట్
వైఎస్సార్ జిల్లా సున్నపురాళ్లపల్లెలో స్టీల్‌ప్లాంట్ ఏర్పాటు;
వైఎస్సార్ జిల్లా సున్నపురాళ్లపల్లెలో స్టీల్‌ప్లాంట్ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక అడుగులు వేసింది. జేఎస్‌డబ్ల్యూ సంస్థ ప్రతిపాదనలకు ఆమోదం తెలుపుతూ, ప్రభుత్వమే స్వయంగా మొదటి దశ పనులకు శ్రీకారం చుట్టనుంది. మొత్తం రూ.16,350 కోట్ల వ్యయంతో ప్లాంట్‌ను రెండు దశల్లో నిర్మించనున్నారు. మొదటి దశలో రూ.4,500 కోట్లతో పనులు ప్రారంభించనున్నారు. ఇందుకోసం సున్నపురాళ్లపల్లెలో 1,100 ఎకరాలను కేటాయించారు. ప్రతి ఎకరాకు రూ.5 లక్షల చొప్పున ఈ భూమిని జేఎస్‌డబ్ల్యూ సంస్థకు అప్పగించారు. ఈ దశలో 2026 జనవరి నాటికి పనులు మొదలుపెట్టి, ఏప్రిల్ నాటికి పూర్తిచేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. రెండో దశలో రూ.11,850 కోట్లతో మరింత విస్తృతంగా నిర్మాణాన్ని చేపట్టి, 2031 జనవరి నాటికి పనులు ప్రారంభించి, 2034 ఏప్రిల్ నాటికి ఉత్పత్తిని మొదలుపెట్టాలని నిర్ణయించింది. ఇప్పటికే ప్రభుత్వ అధికారులు, జేఎస్‌డబ్ల్యూ ప్రతినిధులు కలిసి స్థల సమీక్షను పూర్తి చేశారు. గతంలో భూమిపూజ జరిగినా, రాజకీయ పరిణామాల కారణంగా ప్రాజెక్ట్ ఆలస్యమైంది. కానీ ఇటీవల కూటమి ప్రభుత్వ అధికారం చేపట్టిన తర్వాత పరిశ్రమల అభివృద్ధికి కొత్త ఊపు వచ్చింది. ఈ ప్రాజెక్టుతో కడప జిల్లాలోనే కాదు, రాష్ట్రవ్యాప్తంగా భారీ ఉపాధి అవకాశాలు, ఆర్థిక ప్రగతికి బాటలు తెరవనున్నాయి.