SC: నిర్మాణమే జరగని రింగ్ రోడ్డులో కుట్ర కోణమా..?
ఏపీ సీఐడీ వాదన ఆశ్చర్యంగా ఉందన్న సిద్ధార్థ లూధ్రా... సుప్రీంకోర్టులో వాదనలు...;
నిర్మాణమే జరగని రింగ్ రోడ్డు విషయంలో కుట్ర కోణం ఉందని ఆంధ్రప్రదేశ్ C.I.D చేస్తున్న వాదన ఆశ్చర్యానికి గురిచేస్తోందని చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా హైకోర్టులో వాదనలు వినిపించారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కోసం ఒక్క ఎకరా కూడా సేకరించలేదన్నారు. భూ సేకరణ జరిగినట్లు ఒక్క కాగితమైనా ఏపీ సీఐడీ ఆధారంగా చూపగలదా? అని ప్రశ్నించారు. రాజధాని అమరావతి నిర్మాణాన్నే ఏపీ ప్రభుత్వం నిలిపేసిందని, రింగ్ రోడ్డు ప్రస్తావన ఇంకెక్కడుందని వ్యాఖ్యానించారు. పూర్తి స్థాయి వాదనలు వినిపించేందుకు సమయం లేకపోవడంతో విచారణ సోమవారానికి వాయిదా పడింది.
ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరపింది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రాజకీయ దురుద్దేశంతో కేసులు నమోదు చేశారని చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. పిటిషనర్ దృష్టి మళ్లించేందుకు యత్నిస్తున్నారన్నారు. రింగ్ రోడ్డు ఇప్పటికీ ఉనికిలో ఉందని భావించేటట్లయితే 2014 నుంచి బాధ్యులైన అధికారులను ప్రాసిక్యూట్ చేయాల్సి వస్తుందన్నారు. కొందరు అధికారులు రెండు పడవలపై ప్రమాణం చేస్తున్నారన్నారు. వారు నీటిలో మునగడం ఖాయమన్నారు. అమరావతి బృహత్తర ప్రణాళిక రూపకల్పన విషయంలో సింగపూర్, ఏపీ ప్రభుత్వం మధ్య ఒప్పందం ఉందన్న ఆయన..... నామినేటెడ్ పద్ధతిలో సుర్బానా జురాంగ్ సంస్థకు పనులు అప్పగించారన్న సీఐడీ ఆరోపణలో వాస్తవం లేదన్నారు. లింగమనేని సంస్థ యాజమాన్యానికి కంతేరు, నంబూరు గ్రామాల పరిధిలో పూర్వికుల నుంచి వారసత్వంగా వచ్చిన భూములున్నాయన్నారు. ఏపీ రాష్ట్రం ఏర్పడకముందు.. 2012లోనే ఆ సంస్థ భూములు కొనుగోలు చేసిందన్నారు. హెరిటేజ్ సంస్థ పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ అని.. 2014 మార్చి, ఏప్రిల్ నెలలో ఏపీలోనే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేసిందన్నారు. రింగ్ రోడ్డు ఎలైన్‌మెంట్ మార్పు ద్వారా ప్రయోజనం పొందాలనుకుంటే వ్యక్తుల పేరుపై భూముల కొంటారుకాని... సంస్థ పేరుపై ఎందుకు కొనుగోలు చేస్తారని సిద్ధార్ధ లూథ్రా ప్రశ్నించారు.
ఏపీ C.I.D తరఫున వాదనలు వినిపించిన A.G శ్రీరామ్ C.R.D.A చట్ట నిబంధనలను ఉల్లంఘించిన నేపథ్యంలో ఆ చట్టంలోని సెక్షన్ 146 కింద పిటిషనర్ ప్రాసిక్యూషన్ నుంచి రక్షణ పొందలేరన్నారు. రాజకీయ ప్రతీకారంతో కేసు నమోదు చేశామన్న ఆరోపణలో వాస్తవం లేదన్నారు. నేర తీవ్రతను దృష్టిలో ఉంచుకుని బెయిల్ పిటిషన్‌ను కొట్టేయాలని కోరారు. మరోవైపు ఉచిత ఇసుక కేసులో ముందస్తు బెయిలు కోసం చంద్రబాబు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ ఇరువైపు న్యాయవాదుల అభ్యర్థనతో సోమవారానికి వాయిదా పడింది.