ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్ ముందస్తు బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. సంజయ్ తరఫు న్యాయవాది కపిల్ సిబల్ గైర్హాజరవడంపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. మరోవైపు కపిల్ సిబల్ రానందున విచారణను వాయిదా వేయాలని సంజయ్ తరపు జూనియర్ లాయర్ కోరారు. గతంలో కూడా ఇలాగే జరిగిందని ఏపీ ప్రభుత్వం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ రాజు న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. కేసు విచారణ ఆలస్యం కావడానికే ఇలా చేస్తున్నారని వాదనలు వినిపించారు. ఈ క్రమంలో కపిల్ సిబల్ గురువారం వాదనలకు హాజరు కావాలని, లేదంటే ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.