సస్పెన్షన్ కు గురైన వివాదాస్పద ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఆయన మొదటి నుంచి వివాదాలకు కేంద్ర బిందువుగా ఉంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ వేదిక మీద మాట్లాడుతూ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నేతలకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. ఆ క్రమంలోనే ఒక ముగ్గురి పేర్లు కూడా చెప్పారు. వాళ్లలో ఒకరికి ఇవ్వాలంటూ ఆయన చెప్పడం ఇక్కడ ఇష్యూ అయింది. తమ కులాన్ని కూటమి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అన్న స్థాయిలో ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. వాస్తవానికి సునీల్ సస్పెండ్ లో ఉన్నా సరే ఒక ఐపీఎస్ అధికారి. ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి కులాలకు మతాలకు రాజకీయాలకు పార్టీలకు అతీతంగా మాట్లాడాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ అత్యంత బాధ్యతాయుతంగా ఆయన ప్రవర్తించాలి. కానీ ఐపీఎస్ అధికారి అయ్యుండి ఇలా కులాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం చాలా దారుణం.
కూటమి ప్రభుత్వం అన్ని సామాజిక వర్గాలను ఆదరిస్తోంది. అందరికీ సమానంగా సంక్షేమ పథకాలు, అభివృద్ధి అందేలా చూస్తోంది. ఏపీలో కుల ప్రస్తావన ఉండొద్దని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పదేపదే చెబుతూనే ఉన్నారు. ఏపీలో ఇప్పుడు శాంతిభద్రతలు ప్రశాంతంగా ఉన్న సమయంలో పీవీ సునీల్ వ్యాఖ్యలు కులాల మధ్య చిచ్చుపెట్టేలా కనిపిస్తున్నాయి. ఈయన ఇప్పుడే కాదు గతంలోనూ అనేక వివాదాల్లో ఇరుక్కున్నాడు. అంబేద్కర్ పేరుతో ఒక సంస్థను స్థాపించి బయటి దేశాల నుంచి విరాళాలు పొందుతున్నాడని, అన్యమత ప్రచారం చేస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఆయన హిందూ దేవుళ్ళ మీద రాముడు సీత మీద అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు.
అంతేకాకుండా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజును కస్టడీలో చిత్రహింసలకు గురిచేసిన కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్నాడు. జగన్ హయాంలో రెచ్చిపోయి ప్రతిపక్షాలను టార్గెట్ చేసిన వ్యక్తి పీవీ సునీల్. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పీవీ సునీల్ మీద చట్టపరంగా చర్యలు తీసుకున్నారు. అతని ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అందుకే సునీల్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారేమో అనే ప్రచారం జరుగుతుంది. ఐపీఎస్ అధికారిగా తన బాధ్యతలు నిర్వర్తించకుండా ఇలా కులాల మధ్య చిచ్చు పెట్టాలని చూడటం ఏంటో మరి. ఆయన వ్యాఖ్యలపై ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. చట్టపరంగా చర్యలకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.