విజయనగరం జిల్లా కొత్తవలస మండలం తమ్మన్నమెరక సమీపంలోని ఓ కాలనీలో నవదంపతులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. మృతులను కొప్పుల చిరంజీవి, గీతల వెంకటలక్ష్మి గా గుర్తించారు. వారు ఆత్మహత్య చేసుకున్నారా లేక ఎవరైనా హత్య చేశారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
చిరంజీవి విశాఖపట్నంలోని ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా, ఆయన భార్య వెంకటలక్ష్మి కొత్తవలసలోని ఒక ప్రైవేట్ స్టోర్‌లో పని చేస్తున్నారు. వీరికి వివాహమై కేవలం 8 నెలలు మాత్రమే అయ్యింది. దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉండేవారని బంధువులు చెబుతున్నారు. మృతదేహాలను పరిశీలించిన పోలీసులు, భర్త చిరంజీవి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఉండగా, భార్య వెంకటలక్ష్మి నేలపై విగతజీవిగా పడి ఉన్నట్లు తెలిపారు. ఈ ఘటనపై అన్నీ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి, మరణాలకు గల కారణాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.