యువగళం పాదయాత్రలో ఆసక్తికర దృశ్యం కన్పించింది. అనంతపురం జిల్లా సింగనమ నియోజకవర్గంలో కొనసాగుతున్న లోకేష్ పాదయాత్రలో పవన్ అనే బాలుడు తన తండ్రితో కలిసి పాల్గొన్నాడు. అయితే పవన్ పాదయాత్రలో పాల్గొనడానికి పెద్ద చరిత్రే ఉంది. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం బనకచెర్లకు చెందిన పవన్ గతంలో వినికిడి సమస్యతో పాటు మాటలు రాకపోవడంతో ఎంతో ఇబ్బంది పడ్డాడు. తండ్రి రమేష్ కర్ణాటకకు వలసి వెళ్లి అక్కడే చిన్న చిన్న పనులు చేస్తూ కుమారుడికి వైద్యం చేయించేందుకు అష్టకష్టాలు పడ్డాడు. అయితే కొంత మంది సూచనలతో చంద్రబాబును కలిసిన రమేష్‌కు టీడీపీ అండగా నిలిచింది. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 5 లక్షల 20 వేలను వైద్య సాయంగా అందించారు చంద్రబాబు. దాంతో పవన్‌కు మాటలు రావడంతో పాటు వినికిడి సమస్య కూడా నయం అయ్యింది.
తాజాగా లోకేష్ సింగనమల నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తుండటంతో రమేష్ తన కుమారుడు పవన్‌తో కలిసి వచ్చి లోకేష్‌కు కృతజ్ఞతలు తెలిపాడు. తాము కష్టాల్లో ఉన్న సమయంలో చంద్రబాబు అండగా నిలిచారని గుర్తు చేశారు. చంద్రబాబు వల్లే తమ కుమారుడికి మాటలు వచ్చాయని.. తమ కుటుంబం ఇప్పుడు సంతోషంగా ఉండటానికి ఆయన కారణమని రమేష్ భావోద్వేగానికి లోనయ్యారు. వారిని దగ్గరకు తీసుకున్న లోకేష్.. టీడీపీ ఎప్పుడు పేదల పక్షానే ఉంటుందని చెప్పారు.