AP: ఏ స్థానంలో ఎవరు పోటీ..?

టీడీపీ, బీజేపీ , జనసేన మధ్య పొత్తుతో కొనసాగుతున్న ఉత్కంఠ... కసరత్తు ముమ్మరం చేసిన పార్టీ

Update: 2024-03-10 06:00 GMT

తెలుగుదేశం, బీజేపీ , జనసేన మధ్య పొత్తులపై స్పష్టత రావటంతో... ఏ స్థానంలో ఎవరు పోటీ చేస్తారనే చర్చ జోరందుకుంది. టీడీపీ-జనసేన పార్టీలు తొలి జాబితాలో ఇప్పటికే 99మంది పేర్లు ప్రకటించటంతో మిగిలిన 76అసెంబ్లీ స్థానాల్లో ఎవరెవరు ఎక్కడ పోటీచేస్తారన్న దానిపై నేతల్లో ఉత్కంఠ నెలకొంది. పొత్తులో భాగంగా బీజేపీ, జనసేన పోటీ చేసే 8 లోక్‌సభ స్థానాలు ఏంటనే సందిగ్ధతా కొనసాగుతోంది. తెలుగుదేశం, బీజేపీ , జనసేన కూటమి... పొత్తులో భాగంగా ఎవరెవరు ఎక్కడెక్కడ పోటీ చేయాలనే దానిపై కసరత్తు ముమ్మరం చేశాయి. బీజేపీ- జనసేన కలిసి 30అసెంబ్లీ, 8 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తాయని ఇప్పటికే స్పష్టత రావటంతో... ఏఏ స్థానాల్లో పోటీచేయనున్నాయో... అన్న అంశం చర్చనీయాంశమైంది.


తెలుగుదేశం, జనసేన అభ్యర్థుల్ని ప్రకటించని 76స్థానాల్లో తమకు చోటు ఉంటుందో లేదో అనే ఉత్కంఠ ఆశావహుల్లో నెలకొంది. పొత్తులో భాగంగా తమ స్థానం చేజారకుంటే చాలన్న టెన్షన్‌లో.... ఆశావహులు మలి జాబితా ప్రకటన కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. పొత్తులో భాగంగా బీజేపీ - జనసేన... అరకు, అనకాపల్లి, కాకినాడ, నరసాపురం, రాజమహేంద్రవరం, మచిలీపట్నం, తిరుపతి, రాజంపేట, హిందూపురం... ఈ 8 స్థానాలు దక్కించుకోవచ్చనే ప్రచారం సాగుతోంది. తమకు కేటాయించిన 24అసెంబ్లీ స్థానాల్లో... ఇప్పటికే ఐదుగురు అభ్యర్థుల్ని ప్రకటించిన జనసేన... రాజోలులోనూ పోటీ చేస్తున్నట్లు ఇప్పటికే స్పష్టం చేసింది. జనసేన పోటీ చేయేబోయే మిగతా స్థానాలతో పాటు బీజేపీ పోటీ చేస్తుందనుకుంటున్న 6 అసెంబ్లీ స్థానాలకు ఎవరెక్కడ పోటీ చేస్తారనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.

తెలుగుదేశం, జనసేన ఇంకా అభ్యర్థుల్ని ప్రకటించని జాబితా పరిశీలిస్తే... ఉత్తరాంధ్రలో పలాస, పాలకొండ, విశాఖ ఉత్తరం, దక్షిణం, భీమిలి, యలమంచిలి, పెందుర్తి, మాడుగుల స్థానాలు పొత్తుతో ముడిపడి ఉన్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లోని పిఠాపురం, కాకినాడ అర్బన్, రామచంద్రాపురం, గన్నవరం, అమలాపురం, పోలవరం, నరసాపురం, నిడదవోలు, ఉంగుటూరు, తాడేపల్లిగూడెం, భీమవరం స్థానాల్లోని కొన్నింటిలో పొత్తులో భాగంగా జనసేన-భాజపాలు పోటీ చేయవచ్చని సమాచారం. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో కైకలూరు, విజయవాడ పశ్చిమ, అవనిగడ్డ, గుంటూరు నగరంలోని ఒక స్థానం, దర్శి వంటివి పొత్తుతో ముడిపడే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.ఇక రాయలసీమ జిల్లాల్లోని శ్రీకాళహస్తి, తిరుపతి, మదనపల్లి, అనంతపురం, కదిరి, ధర్మవరం, రైల్వేకోడూరు, జమ్మలమడుగుల్లో ఏఏ స్థానాలు పొత్తులో జనసేన, భాజపాలకు కేటాయిస్తారనే ఉత్కంఠ కొనసాగుతోంది.

Tags:    

Similar News