వైసీపీ ప్రభుత్వ అరాచకానికి చెంపపెట్టు : చంద్రబాబు
చట్టవిరుద్ధ ఎన్నికలను టీడీపీ బహిష్కరించడం సరైన చర్యేనని హైకోర్టు తీర్పుతో రుజువైందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు..;
చట్టవిరుద్ధ ఎన్నికలను టీడీపీ బహిష్కరించడం సరైన చర్యేనని హైకోర్టు తీర్పుతో రుజువైందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు.. ఏపీలో పరిషత్ ఎన్నికలపై సింగిల్ జడ్జి స్టే ఇవ్వడాన్ని ఆయన స్వాగతించారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా పరిషత్ ఎన్నికలకు వెళ్లడాన్ని హైకోర్టు నిలుపుదల చేయడం అంబేద్కర్ రాజ్యాంగ విజయమని చెప్పారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాలనుకుంటున్న వైసీపీ ప్రభుత్వ అరాచకానికి చెంపపెట్టు అన్నారు. ఈ చట్ట విరుద్ధ ఎన్నికలను బహిష్కరించడం సరైందని మరోసారి రుజువైందన్నారు.
ఇప్పటికైనా జగన్ రెడ్డి ప్రభుత్వం రాజారెడ్డి రాజ్యాంగాన్ని విడనాడి అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తిని స్వీకరించి పరిషత్ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ నుంచి ఎన్నికలను ప్రారంభిస్తూ కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలన్నారు. న్యాయస్థానాల మార్గదర్శకాలను ధిక్కరించే విధానాన్ని జగన్ రెడ్డి మానుకోవాలని ప్రభుత్వానికి చంద్రబాబు సూచించారు. ఎన్నికల కమిషనర్ చట్ట ప్రకారం స్వతంత్రంగా వ్యవహరించాలి కానీ, రబ్బరు స్టాంపులా మారకూడదన్నారు చంద్రబాబు.
నోటిఫికేషన్ ఇచ్చి ఏడాది దాటిపోయిందని.. కొత్త ఓటర్లు నమోదైన వారికి అవకాశం కల్పించే విధంగా కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలని టీడీపీ డిమాండ్ చేస్తోందన్నారు చంద్రబాబు. అప్రజాస్వామిక విధానంలో కాకుండా ప్రజాస్వామ్యయుతంగా ప్రజలకు నచ్చిన నాయకులను ఎన్నుకునే విధంగా ఎన్నికలు నిర్వహించాలన్నారు. ఎన్నికలను ఒక ఫార్స్‌గా మార్చకుండా ఫ్రీ అండ్ ఫెయిర్‌గా జరపాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు.