CBN: పోలింగ్ సమీపిస్తున్న వేళ అప్రమత్తంగా ఉండండి
తెలుగుదేశం శ్రేణులకు చంద్రబాబు పిలుపు... వైసీపీ ప్రభుత్వానికి వీడ్కోలు పలకాలని ప్రజలకు పిలుపు;
పోలింగ్ కు సమయం దగ్గరపడుతున్నందున తెలుగుదేశం శ్రేణులన్నీ అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు హెచ్చరించారు. అక్రమంగా దోచుకున్న సొమ్ము వెదజల్లి ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు వైసీపీ కుట్రలకు పాల్పడుతోందని దీన్ని సమర్థంగా తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. వరుస ప్రజాగళం సభల్లో చంద్రబాబు తీరికలేకుండా పాల్గొన్నారు. ఉండి, ఏలూరు సభల్లో చంద్రబాబుకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. గన్నవరంలో జోరువానను సైతం లెక్కచేయకుండా జనం నిల్చుని ఆయన ప్రసంగాన్ని ఆలకించారు.
మరో మూడు రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో వైపీసీ ప్రభుత్వ అవినీతి, దోపిడీకి ముగింపు పలకాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఉండి, ఈ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. జగన్ అహంకారి, సైకో.. విధ్వంసకారుడన్న ఆయన ప్రజలు వేసే ఓటుతో తాడేపల్లి ప్యాలెస్ బద్ధలుకావాలన్నారు. ఏపీని గంజాయి మయం చేశారన్న చంద్రబాబు ప్రజల భూముల పత్రాలపై జగన్ ఫొటో ఎందుకని ప్రశ్నించారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం లోపభూయిష్టంగా ఉందన్నారు. రాబోయే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపిస్తే సకల జనుల అభివృద్ధి కోసం పనిచేస్తామన్నారు. పోలీసులకు రద్దయిన అలవెన్సులన్నీ ఇస్తామని, హోంగార్డుల జీతాలు 18వేల నుంచి 25 వేల రూపాయలకు పెంచుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
ప్రజల ఆస్తులకు భద్రత కావాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించాలని.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు కోరారు. గన్నవరంలో ప్రజాగళం సభలో పాల్గొన్న చంద్రబాబు జోరుగా వాన పడుతున్నప్పటికీ తడుస్తూనే ప్రసంగించారు. రేపు సాయంత్రం 4గంటలకు ఏపీ వ్యాప్తంగా ప్రజలంతా రోడ్లపైకి వచ్చి జగన్ ఫోటో ఉన్న పాస్ పుస్తకాల నకళ్లను తగలబెట్టాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం కంచుకోట గన్నవరంలో సైకోల ఆటలు సాగవని హెచ్చరించారు. గన్నవరంలో వర్షం కూటమి విజయానికి శుభ సూచికతెలుగుదేశం శ్రేణులకు చంద్రబాబు పిలుపు... వైసీపీ ప్రభుత్వానికి వీడ్కోలు పలకాలని ప్రజలకు తెలిపారు. భారీ వర్షంలోనూ వచ్చిన ప్రజలను గుండెల్లో పెట్టుకుంటా అని చెప్పారు.
మాచర్ల సభ రద్దు..
ప్రతికూల వాతావరణంతో చంద్రబాబు మాచర్ల సభ రద్దయ్యింది. వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలను ఉద్దేశించి ఆయన వీడియో సందేశం పంపారు. ఐదేళ్లుగా నరకం అనుభవించిన తెలుగుదేశం కార్యకర్తలకు విముక్తి లభించనుందని...పల్నాటి పౌరుషాన్ని ఎన్నికల్లో చూపించాలని ఆయన పిలుపునిచ్చారు. వైకాపా రౌడీ మూకలను తరిమేందుకు బ్రహ్మారెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న ఎంపీ అభ్యర్థి లావు కృష్ణదేవరాయులను గెలిపించాలని పిలుపునిచ్చారు.