AP: మంత్రివర్గంలోకి నారా లోకేశ్
ప్రాధాన్యమున్న మంత్రిత్వశాఖలు కేటాయించే అవకాశం... పార్టీ నిర్ణయమే శిరోధార్యమన్న లోకేశ్;
తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి లోకేశ్... రాష్ట్ర మంత్రివర్గంలో చేరనున్నారు. ఆయనకు ప్రాధాన్యమున్న మంత్రిత్వశాఖల బాధ్యతలు అప్పగించే అవకాశముంది. ఈ మేరకు తెదేపా అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సుదీర్ఘ పాదయాత్ర చేసి ఎన్డీయే విజయంలో కీలక భూమిక పోషించిన లోకేశ్ ఒక సందర్భంలో.. ఎన్నికల్లో గెలిచాక మంత్రివర్గంలో చేరడం కన్నా పార్టీపరంగా బాధ్యతలు తీసుకుంటానని ప్రకటించారు. తాజాగా ఓట్ల లెక్కింపు ముగిశాక విలేకరులతో మాట్లాడుతూ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా శిరసావహిస్తానన్నారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గంలో లోకేశ్ చేరతారా, లేదా అన్న దానిపై పార్టీ వర్గాల్లో రెండురోజులుగా చర్చ జరుగుతోంది. తాజాగా పార్టీ అధినేత చంద్రబాబు స్పష్టత ఇచ్చినట్లు సమాచారం. బయట ఉంటే కీలక విధాన నిర్ణయాలు, వాటి అమల్లో భాగస్వామ్యం ఉండదన్న ఉద్దేశంతోనే మంత్రివర్గంలోకి తీసుకోవాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.
మరోవైపు కేంద్ర కేబినెట్‌లో 2 మంత్రి పదవులు మరో రెండు సహాయ మంత్రి పదవులు లభించే వీలుందని తెలుగుదేశం పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. NDA నేతలతో కలిసి... రాష్ట్రపతితో భేటీ అయ్యేందుకు గురువారం రాత్రి దిల్లీకి వెళ్లిన చంద్రబాబు.. మంత్రి పదవులు, శాఖల గురించి ఇవాళ బీజేపీ అగ్రనేతలతో చర్చించనున్నారు. ఈ నెల 9న మోదీతో పాటే... తెలుగుదేశం సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశముంది.. తెలుగుదేశం నుంచి లోక్‌సభకు గెలుపొందినవారిలో... బలహీనవర్గాలకు చెందినవారు అత్యధికంగా ఆరుగురున్నారు.
వీరిలో వరుసగా మూడోసారి గెలుపొందిన శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌నాయుడి పేరు మంత్రి పదవికి.. ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన తండ్రి దివంగత నేత ఎర్రన్నాయుడు కేంద్ర మంత్రిగా పనిచేశారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. ఆయన మరణం తర్వాత రామ్మోహన్‌నాయుడు రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఆయన బాబాయి అచ్చెన్నాయుడు, మామ బండారు సత్యనారాయణ మూర్తి, బావ ఆదిరెడ్డి వాసు తాజా ఎన్నికల్లో శాసనసభకు ఎన్నికయ్యారు. హిందూపురం నుంచి రెండోసారి గెలిచిన పార్థసారధి సీనియర్ అయినప్పటికీ... రామ్మోహన్‌నాయుడి వైపు మొగ్గు కనిపిస్తోంది. ఎస్సీ వర్గానికి చెందినవారిలో ముగ్గురు ఉండగా... అందరూ తొలిసారి ఎన్నికైనవారే. వీరిలో అమలాపురం ఎంపీ హరీష్ మాధుర్... లోక్‌సభ స్పీకర్‌గా పనిచేసిన దివంగత బాలయోగి కుమారుడు. గత ఎన్నికల్లో ఓడిపోయిన హరీష్... ఈసారి విజయం సాధించారు. మిగిలిన ఇద్దరు పదవీ విరమణ చేసిన IPS అధికారి కృష్ణప్రసాద్, రిటైరైన IRS అధికారి ప్రసాదరావు. వివిధ సమీకరణాలతోపాటు.. రాయలసీమ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రసాదరావు వైపు.. కొంత మొగ్గు ఉండొచ్చన్న భావన పార్టీ వర్గాల్లో ఉంది. మిగిలిన రెండు ప్రధాన వర్గాల్లో... గుంటూరు, నరసరావుపేట నుంచి గెలుపొందిన పెమ్మసాని చంద్రశేఖర్, లావు శ్రీకృష్ణదేవరాయలు నుంచి ఒకరు..., నెల్లూరు, నంద్యాల నుంచి విజయం సాధించిన వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, బైరెడ్డి శబరి నుంచి మరొకరిని పరిశీలించే అవకాశముందని... పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. నాలుగు పదవులు కాకున్నా... డిప్యూటీ స్పీకర్ వంటి పదవి తీసుకోవాల్సి వచ్చినా... సమీకరణాలు కొంతమేర మారతాయి.