నారా లోకేష్ నరసరావుపేట పర్యటనపై ఉత్కంఠ..!

నారా లోకేష్ నరసరావుపేట పర్యటనపై ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రస్తుతం గన్నవరం నుంచి ఆయన కాన్వాయ్‌ విజయవాడ వారధి వద్దకు చేరింది.;

Update: 2021-09-09 08:47 GMT

నారా లోకేష్ నరసరావుపేట పర్యటనపై ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రస్తుతం గన్నవరం నుంచి ఆయన కాన్వాయ్‌ విజయవాడ వారధి వద్దకు చేరింది. ఐతే.. అక్కడి నుంచి ఆయన్ను ఉండవల్లిలోని నివాసానికి తీసుకు వెళ్తామని పోలీసులు చెప్తుంటే, కచ్చితంగా అనూష కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తాల్సిందేనని లోకేష్‌ పట్టుబట్టారు. అటు, లోకేష్ కాన్వాయ్ ఆపిన విషయం తెలిసి అక్కడకు పెద్ద ఎత్తున టీడీపీ నేతలు, కార్యకర్తలు చేరుకుంటున్నారు. మాజీ మంత్రి దేవినేని ఉమ సహా పలువురు నేతలు అక్కడికి వెళ్లి పరామర్శకు పర్మిషన్ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు.

ఇప్పటి వరకూ తాను పోలీసులకు సహకరించానని, ఆంక్షల పేరుతో పర్యటన అడ్డుకోవడం సరికాదని లోకేష్ అన్నారు. ఐనా.. అనుమతి ఇచ్చేది లేదని పోలీసులు చెప్పడంతో విజయవాడ డీసీపీకి, లోకేష్‌కు మధ్య వాగ్వాదం జరిగింది. ఉదయం నుంచే గన్నవరం టు నరసరావుపేట మొత్తం హైటెన్షన్ నెలకొన్న నేపథ్యంలో.. పర్యటనకు అనుమతి ఇస్తారా, పోలీసులు ఏం చేస్తారు అనేది చర్చనీయాంశమైంది. తమ మాట కాదని పర్యటనకే వెళ్తానంటే అరెస్టు చేయాల్సి ఉంటుందని కూడా పోలీసులు చెప్పడంతో పరిస్థితి ఉద్రిక్తంగా కనిపిస్తోంది.

బాధిత కుటుంబాన్ని ఓదార్చేందుకు, పరామర్శించేందుకు కూడా పర్మిషన్ కావాలా అంటూ పోలీసుల్ని ప్రశ్నిస్తున్న లోకేష్.. నరసరావుపేట వెళ్లాలనే తన నిర్ణయాన్ని మార్చుకునేది లేదని స్పష్టం చేశారు. అటు, ఎక్కడికక్కడ టీడీపీ నేతలు, కార్యకర్తలు, అనుబంధ విభాగాల నేతల్ని అరెస్టు చేయడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గన్నవరం నుంచి విజయవాడ కనకదుర్గ వారధికి చేరుకున్నా లోకేష్‌ కాన్వాయ్‌ని అక్కడ దాదాపు అరగంటకుపైగా అక్కడే ఆపేయడం పట్ల తెలుగుదేశం శ్రేణులు మండిపడుతున్నాయి.

Tags:    

Similar News