బలవంతపు ఏకగ్రీవాలు, ఎన్నికల తీరుపై ఎస్‌ఈసీకి టీడీపీ నేతలు ఫిర్యాదు
ఏపీలో పంచాయతీ ఎన్నికల తీరుపై ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు ఫిర్యాదు చేశారు టీడీపీ నేతలు. ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎస్ఈసీని కోరారు.;
ఏపీలో పంచాయతీ ఎన్నికల తీరుపై ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు ఫిర్యాదు చేశారు టీడీపీ నేతలు. ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎస్ఈసీని కోరారు. నామినేషన్ల ప్రక్రియలో దాడులకు దిగిన వైసీపీ నేత దువ్వాడ శ్రీనివాస్‌ను ఎందుకు అరెస్ట్ చేయలేదో ఎస్ఈసీని అడిగామన్నారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య. దువ్వాడపై తూతూ మంత్రంగా కేసు నమోదు చేసి.. అచ్చెన్నను మాత్రం అరెస్ట్ చేశారన్నారు. అధికారులు వైసీపీ నేతల ఆదేశాల పాటించకుండా.. చట్ట ప్రకారం పనిచేయాలన్నారు వర్ల రామయ్య.
రాష్ట్రంలో వైసీపీ నేతలు అధికార దుర్వినియోగం చేస్తున్న వైనాన్ని ఎస్ఈసీ దృష్టికి తీసుకెళ్లామన్నారు మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు. శ్రీకాకుళంలో పట్టపగలు మారణాయుధాలతో దాడులు చేసిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఎస్ఈసీని అడిగామన్నారు. అచ్చెన్నాయుడు కేసు విషయమై దర్యాప్తు కోసం స్పెషల్ ఆఫీసర్‌ను శ్రీకాకుళం వెళ్లమని ఆదేశించినట్లు ఎస్ఈసీ చెప్పారన్నారు బోండా ఉమ.