TDP Chittoor : వచ్చేది టీడీపీ ప్రభుత్వమే..

TDP Chittoor : టీడీపీ అధినేత చంద్రబాబు ఉమ్మడి చిత్తూరు జిల్లా పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది

Update: 2022-07-07 16:00 GMT

TDP Chittoor : టీడీపీ అధినేత చంద్రబాబు ఉమ్మడి చిత్తూరు జిల్లా పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది. ఈసారి అధికారంలోకి లక్ష్యంతో... పార్టీ నేతల్ని, కార్యకర్తల్ని నడిపిస్తున్నారు చంద్రబాబు. రాజంపేట పార్లమెంటు సెగ్మెంట్‌లో నేతలు, కార్యకర్తలతో సమీక్ష నిర్వహిస్తున్నారు. పీలేరులో నియోజకవర్గాల నేతలతో స్వయంగా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొందరు నేతలు యాక్టివ్‌‌గా లేకపోవడం, పార్టీ కార్యక్రమాలను సక్రమంగా నిర్వహించకపోవడం వంటి అంశాలపై సీరియస్‌ అయ్యారు. టికెట్‌ ఆశావహులకు చంద్రబాబు కీలక హెచ్చరికలు చేశారు. ఎవరు ఫీల్డ్ లో పనిచేస్తున్నారో.. ఎవరు పని చేయకుండా నా దగ్గరకు వచ్చి మాటలు చెప్తున్నారో నాకు తెలుసని చంద్రబాబు వ్యాఖ్యానించారు. మూడేళ్ల నుంచి నియోజకవర్గాల్లో ఏం జరుగుతోందో అన్నీ ఎప్పటికప్పుడు ట్రాక్‌ చేస్తున్నానన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎవరు పోటీ చేస్తారనేది ఫైనల్‌ చేయాల్సింది తానేనని స్పష్టం చేశారు.. అందరి డేటా తన దగ్గరుందన్నారు చంద్రబాబు.

రాష్ట్రంలో పరిస్థితులు, రానున్న ఎన్నికలు, టీడీపీని బలోపేతం చేయడంతోపాటు వైసీపీ సర్కార్‌ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను జనంలోకి బలంగా తీసుకెళ్లడమే లక్ష్యంగా నేతలకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు చంద్రబాబు. వైసీపీ ప్రభుత్వంపైనా నిప్పులు చెరిగారు చంద్రబాబు. టీడీపీ పని అయిపోయిందని జగన్‌ సంబర పడ్డారని.. ఇప్పుడు టీడీపీని చూసి భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనన్నారు చంద్రబాబు.. అందరూ కలసికట్టుగా పనిచేస్తే టీడీపీ విజయాన్ని ఎవరూ ఆపలేరన్నారు.. నియోజకవర్గాల్లో ఉన్న లోపాలను సరిచేస్తానని చెప్పారు చంద్రబాబు.

చంద్రబాబు ఆధునిక సాంకేతికతతో కూడిన రింగ్‌ ధరించడం అందరిని ఆకట్టుకుంది. ఎడమచేతి చూపుడు వేలుకు ధరించిన ఈ రింగ్‌లో మైక్రో చిప్‌ ఉంది. ఇది చంద్రబాబు ఆరోగ్య వివరాలను ఎప్పటికప్పుడు మానిటర్‌ చేస్తుంది. బీపీ, హార్ట్‌ రేట్‌, నిద్ర సమయం తదితర ఆరోగ్య వివరాలు చిప్‌లో నమోదవుతున్నాయి. ఈ రింగ్‌ గురించి పార్టీ క్యాడర్‌కు వివరించారు చంద్రబాబు. టెక్నాలజీతో కూడిన రింగ్‌తో ఆరోగ్య పరిస్థితిని... ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నట్లు తెలిపారు చంద్రబాబు. ప్రతి కార్యకర్త ఆరోగ్యంపై శ్రద్ధపెట్టాలని సూచించారు. కార్యకర్తలు, నేతల ఆరోగ్యం కోసం న్యూట్రిల్లా యాప్‌ను తీసుకొచ్చామన్నారు.

Tags:    

Similar News