TDP PROTESTS: ఎగిసిపడుతున్న ఆందోళనలు

చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా టీడీపీ ఆందోళనలు... మద్దతు తెలిపిన జనసేన, వామపక్షాలు;

Update: 2023-09-25 03:00 GMT

తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు అరెస్ట్‌కు నిరసనగా ఆందోళనలు ఎగిసిపడుతున్నాయి. జనసేన, వామపక్ష నేతలు టీడీపీ ఆందోళనలకు మద్దతు తెలుపుతున్నారు. ఏపీ వ్యాప్తంగా టీడీపీ శ్రేణుల నిరసన దీక్షలు కొనసాగుతున్నాయి. అవినీతిలో కూరుకుపోయిన జగన్‌కు అందరూ అవినీతిపరుల్లానే కనిపిస్తున్నారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని కోరుతూ అనంతపురం జిల్లా గుంతకల్లులో జనసేన, వామపక్షాలతో కలిసి టీడీపీ భారీ ర్యాలీ నిర్వహించింది. టీడీపీ నేతల దీక్షా శిబిరాన్ని జనసేన నాయకులు సందర్శించి సంఘీభావం తెలిపారు. కర్నూలు జిల్లా కోడుమూరులో రిలే దీక్షల్లో నల్ల బెలూన్లతో నిరసన తెలిపారు. కర్నూలులో దీక్షలకు వీరశైవ సామాజిక వర్గానికి చెందిన వారు మద్దతు తెలిపారు. నంద్యాల జిల్లా గుటుపల్లిలోని పెద్దరాజు స్వామి దర్గా వద్ద 101 టెంకాయలు కొట్టి టీడీపీ నిరసన తెలిపింది.


చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ అమరావతి ప్రాంతంలో రైతులు, మహిళలు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. తుళ్లూరులో దీక్షా శిబిరం వద్ద మహిళలు చంద్రబాబుకు మద్దతుగా నినాదాలు చేస్తూ మానవహారం నిర్వహించారు. మంగళగిరి మండలం నీరుకొండలో రైతులు, మహిళలు శాంతి ర్యాలీ చేపట్టారు. ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేటలో నిరసన దీక్షలకు వత్సవాయి మండలంలోని పలు గ్రామాల నుంచి టీడీపీ కార్యకర్తలు తరలివచ్చారు. కృష్ణా జిల్లా ఉయ్యూరులో చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పెనమలూరు నియోజకవర్గంలోని వణుకూరు నుంచి గోసాల వరకు మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.


అన్నమయ్య జిల్లా మదనపల్లెలో రిలే దీక్షల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సిద్ధవటం మండలం సాకరాసపల్లెలో తెదేపా సీనియర్‌ నాయకులు చమర్తి జగన్‌ రాజు ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబును విడుదల చేయాలని కోరుతూ తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం తాళ్వాయిపాడులో వీర్లయ్య ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. శ్రీకాళహస్తిలో టీడీపీ ఎస్సీ సెల్ నాయకుడు గోపినాథ్‌ అరగుండు కొట్టించుకుని వినూత్నంగా నిరసన తెలిపారు.

నెల్లూరు బారాషాహీద్ దర్గాలో తెలుగుదేశం నేతలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కొవ్వూరు నియోజకవర్గ తెదేపా నేతలు చంద్రబాబుకు మద్దతుగా దైవానుగ్రహ పాదయాత్ర చేపట్టారు. ఏలూరు జిల్లా నూజివీడు మండలం బత్తులవారిగూడెంలో తెదేపా శ్రేణులు మోకాలిపై నిలబడి న్యాయదేవతకు వినతిపత్రం అందించారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో తెదేపా, సీపీఐ నాయకులు రోడ్లు ఊడ్చి వినూత్న రీతిలో నిరసన తెలిపారు.

Tags:    

Similar News