Andhra Pradesh: ఆర్టీసీ ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ టీడీపీ శ్రేణుల ఆందోళనలు..

Andhra Pradesh: ఆర్టీసీ ఛార్జీల పెంపుపై టీడీపీ శ్రేణులు ఏపీ వ్యాప్తంగా చేసిన ఆందోళనలు మిన్నంటాయి.

Update: 2022-04-14 16:15 GMT

Andhra Pradesh: ఆర్టీసీ ఛార్జీల పెంపుపై టీడీపీ శ్రేణులు ఏపీ వ్యాప్తంగా చేసిన ఆందోళనలు మిన్నంటాయి. జగన్‌ సర్కార్‌ బాదుడే బాదుడుతో సామాన్యుడి నడ్డి విరుగుతోందని టీడీపీ నేతలు ఫైరవుతున్నారు. పెంచిన ఛార్జీలు తగ్గించాలని కదిరి టీడీపీ ఇన్‌ఛార్జ్‌ కందికుంట వెంకటప్రసాద్‌ ఆధ్వర్యంలో బస్టాండ్‌ లో ధర్నా చేపట్టారు. పెంచిన ఛార్జీలు తగ్గించాలని డిమాండ్‌ చేశారు.

కర్నూలు జిల్లాలో టీడీపీ, ప్రజా సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. టీడీపీ నేతలు, కార్యకర్తలు రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. పెరిగిన గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌, చెత్త, ఆస్తి పన్నులు, కరెంటు ఛార్జీలు చాలవన్నట్టు ఆర్టీసీ ఛార్జీలు కూడా పెంచుతున్నారని మండిపడుతున్నారు. ఆర్టీసీ ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు రోడ్డెక్కి ధర్నా చేపట్టాయి.

ఆర్టీసీ డిపో వద్ద టీడీపీ నేతలు, కార్యకర్తలు నిరసన తెలిపారు. పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆందోళనలో పాల్గొన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో పేద, మధ్య తరగతి ప్రజలపై మరింత భారం పడుతుందని అన్నారు. ఆర్టీసీ ఛార్జీల పెంపును నిరసిస్తూ తిరుపతి డిపో ముందు ధర్నా చేపట్టారు టీడీపీ నేతలు. ఈ నిరసనల్లో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ కూడా పాల్గొన్నారు.

అటు.. తిరుపతి పార్లమెంట్ తెలుగు యువత అధ్యక్షుడు రవి నాయుడు ధరల కరపత్రాలు పంచుతూ నిరసన తెలిపారు. ఆర్టీసీ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్‌లో బైఠాయించారు టీడీపీ నేతలు. ప్రభుత్వం ప్రజలను బస్సు ఎక్కనీయకుండా చేస్తుందని మండిపడ్డారు. ఛార్జీల పెంచి ప్రజలపై కోట్ల రూపాయల భారం వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

జగన్‌ అంటేనే బాదుడే బాదుడు అన్నారు టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌. పెంచిన ఆర్టీసీ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ విజయవాడ కనకదుర్గ వారధి వద్ద నిరసన చేపట్టారు. నమ్మి ఓట్లేసినందుకు జగన్‌ పిడిగుద్దులు గుద్దుతున్నారని విమర్శించారు. కోనసీమ జిల్లా అమలాపురంలో మాజీ ఎమ్మెల్యే ఆనందరావు ఆధ్వర్యంలో టీడీపీ నిరసన చేపట్టింది.

ధరలు తగ్గించాలంటూ అమలాపురం ఆర్టీసీ బస్టాండ్‌ ముందు ఆందోళనకు దిగారు టీడీపీ శ్రేణులు. అటు మామిడివరంలో టీడీపీ ర్యాలీ నిర్వహించింది. ఏపీలో అసమర్ధ పాలన ఉందంటూ విమర్శించారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. పెంచిన ఛార్జీలను తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ తిరుపతిలోని ఆర్టీసీ డిపో ముందు ధర్నా చేపట్టారు. మొత్తంగా జగన్‌ బాదుడే బాదుడుపై ఏపీలో ఆందోళనలు మిన్నంటాయి.

Tags:    

Similar News