AP: గోదావరి జిల్లాల్లో కూటమి సునామీ

ఈ స్థాయిలో జన ప్రభంజనంతో కూటమి నేతల సంతోషం... క్లీన్‌ స్వీప్‌ ఖాయమంటున్న నిపుణులు

Update: 2024-04-14 03:30 GMT

ఐదేళ్ల వైసీపీ పాలనలో ఏపీ ప్రజలకు ఒరిగిందేమీ లేదని గోదారివాసులు ముక్తకంఠంతో నినదిస్తున్నారు. చేసేందుకు పనులు లేక, బిడ్డలకు భవిష్యత్తు కనిపించక జగన్‌ పాలనలో తీవ్రంగా నష్టపోయిన ప్రజలు నిరంకుశత్వ గోడలు దాటి ధైర్యంగా అసంతృప్తి గళాన్ని వినిపిస్తున్నారు. గోదారి జిల్లాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రెండు రోజుల ప్రజాగళం పర్యటనకు పోటెత్తిన జనసునామీనే ఇందుకు నిదర్శనమని రుజువవుతోంది. ఐదేళ్ల జగన్‌ పాలనపై మీడియా ప్రతినిధులుగానో లేక సర్వే సంస్థ నిర్వాహకులుగానో కాకుండా సగటు మనిషిగా గోదారోళ్ల అభిప్రాయాల్ని ప్రశ్నించగా వారి గుండె సవ్వడి వినిపించారు. ఉభయ గోదావరి జిల్లాల్లో పదిమందిని కదిలిస్తే ఏడుగురు తమ గోడు వెళ్లబోసుకునే వారే ఉన్నారు. సామాన్యులు, పేదలు ధరల పెరుగుదలతో అవస్థలు పడుతున్నామని చెబుతున్నారు. మొన్నటిదాకా ప్రభుత్వ విధానాలపై నోరుమెదపాలంటే జంకిన ప్రజలు... నేడు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై నిర్భయంగా తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.


మద్యం విధానంపై జగన్‌ ప్రభుత్వ తీరును మందుబాబులు తీవ్రంగా ఎండగడుతున్నారు. గతంలో క్వార్టర్‌ బాటిల్‌ 50 రూపాయలు ఉంటే నేడు ఆ ధర 200 లకు పెరగడంతో పాటు ఆరోగ్యం దెబ్బతీస్తోందని వాపోయారు. విచ్చలవిడిగా బటన్లు నొక్కి డబ్బులిచ్చినా.. మళ్లీ ప్రభుత్వ బాదుడు రూపంలో జేబులు ఖాళీ అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్‌ సర్కార్‌ జిమ్మిక్కులను ప్రజలు గమనిస్తున్నారని... ఎన్నికల్లో ఇవన్నీ తప్పక ప్రభావం చూపిస్తాయని చెబుతున్నారు. పింఛన్లు, ఇళ్ల స్థలాలు కొందరికే అందాయని, వివిధ కారణాలు చూపుతూ లబ్దిదారుల సంఖ్యలో కోత విధించారని అసంతృప్తి వ్యక్తం చేశారు. కొందరు పథకాలు అందుతున్నాయని చెప్పినా.. విద్యుత్‌ ఛార్జీలు, నిత్యావసరాల పెరుగుదలతో ఇబ్బందిపడుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు.


కూటమి నేతల సభలకు వస్తున్న జన సునామీని చూస్తుంటే... ఐదేళ్ల జగన్‌ పాలనపై ప్రజల్లో గూడుకట్టుకున్న అసంతృప్తి బద్దలైనట్లు కనిపిస్తోంది. అమలాపురం, అంబాజీపేట జనగళం సభల్లో చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ ఇద్దరూ ఓటు బదిలీ గురించి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గాజుగ్లాసు లేనిచోట సైకిల్, కమలం గుర్తులకు.... సైకిల్‌ లేని చోట గాజుగ్లాసు, కమలం గుర్తుకు ఓటు వేయాలని కూటమి అధినేతలు ప్రజల్ని కోరారు. చాలాచోట్ల తెదేపా, జనసేన, కమలం పార్టీల పొత్తును ప్రజలు ‘కూటమి’అనే ప్రస్తావిస్తున్నారు. వారి నియోజకవర్గంలో జనసేన పోటీ చేస్తోందా, తెదేపా పోటీ చేస్తోందా అన్న స్పష్టత సామాన్య ప్రజానీకంలో ఉంది. ఇవన్నీ ఒక కీలక పరిణామానికి, రాజకీయ మార్పునకు దారి తీస్తున్నాయా? అన్న ప్రశ్నలు కలిగిస్తున్నాయి. దీనికితోడు ‘ఈసారి గాలి పక్కకు వీస్తోందండీ' అనే ప్రజల సంభాషణలు అధికారం మార్పు దిశగా... వేగంగా మారుతున్న పరిణామాలకు సంకేతంగా కనిపిస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Tags:    

Similar News