మహిళల వ్యక్తిత్వాన్ని అవహేళన చేస్తూ కించపరచే వ్యాఖ్యలు చేయడం వైసీపీ నాయకులకు ఒక అలవాటుగా మారిపోయిందన్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై ఆ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమైనవని తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటనను రిలీజ్ చేశారు. ఆ మాటలకి సభ్య సమాజం సిగ్గుపడుతుంది. వ్యక్తిగత జీవితాలను లక్ష్యంగా చేసుకొని వ్యాఖ్యలు చేయడం, మహిళలను కించపరచడాన్ని ప్రజాస్వామికవాదులందరూ ఖండించాలి. శ్రీమతి ప్రశాంతి రెడ్డి గారిపైనా, నెల్లూరు ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి గారిపైనా సదరు మాజీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు అందరికీ బాధ కలిగించాయి. మహిళల గౌరవానికి భంగం కలిగించినా, అసభ్య వ్యాఖ్యలు చేసినా చట్ట ప్రకారం చర్యలుంటాయి. అధికారంలో ఉన్నప్పుడూ ఆ పార్టీ నాయకులు నోటి వదరుతో అసభ్యంగా వ్యాఖ్యలు చేశారు. నిండు శాసనసభలో కూడా అదే విధంగా మాట్లాడటంతో... ప్రజలు సరైన రీతిలో తీర్పు చెప్పారు. అయినప్పటికీ వదరుబోతు మాటలు వదల్లేకపోతున్నారు. మహిళా సమాజం మరోసారి ఆ పార్టీకి తగిన విధంగా సమాధానం చెబుతుందని తెలిపారు.