tirumala: 27 ఏళ్లుగా తిరుమల శ్రీవారి సేవలో...
రూపాయి తీసుకోకుండా సేవ చేస్తున్న భక్తుడు;
కోట్లాది మంది ఆరాధ్య దైవమైన శ్రీనివాసుడికి భక్తుల విషయంలో ఎలాంటి కొదవ లేదు. శ్రీవారి సేవలో మహారాజుల నుంచి కటిక నిరుపేద వరకూ తరించిన వారే. క్షణకాలం పాటు జరిగే శ్రీనివాసుడి దర్శన భాగ్యం కోసం కోట్లాది మంది భక్తులు పరితపించి పోతుంటారు.. భక్తుల పాలిట కొంగు బంగారంమైన శ్రీ వేంకటేశ్వరుడి సన్నిధిలో గడపాలని, ఆయన సేవ చేయాలని భక్తులు ఎంతగానో తపించి పోతారు. కొందరు శ్రీనివాసుడికి కోట్ల రూపాయలు కానుకలుగా సమర్పిస్తే, మరి కొందరు ఆభరణాల రూపంలో, భూముల రూపంలో స్వామి వారికి కానుకలుగా సమర్పించడం చూస్తూనే ఉన్నాం. ఇలా ఒక్కొక్కరు ఒక్కలా సేవలో చేస్తుంటే తిరుపతికి చెందిన ఒక వ్యక్తి మాత్రం స్వామి వారిపై అపారమైన భక్తి భావంతో దాదాపు 27 ఏళ్ళుగా పరదాలను కానుకగా సమర్పించి శ్రీ వేంకటేశ్వరుడి సేవకు అంకితం అయ్యారు. ఆయనే పరదాల మణి. ఏటా నాలుగుసార్లు ప్రత్యేక రోజుల్లో పరదాలు ఇవ్వడం పరదాల మణి ఆనవాయితీ. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం సందర్భంగా మణి కాలినడకన తిరుమలకు చేరుకుని దేవస్థానం అధికారులకు పరదాలు అందజేస్తారు. ఆయన తయారుచేసిన పరదాలు గర్భాలయం, రాములవారి మేడలో అలంకరిస్తారు. టైలర్‌గా జీవితం ప్రారంభించిన మణి, శ్రీనివాసుడి పిలుపుతో ఈ సేవకు అంకితమయ్యారు.
పరమ భక్తుడు
ఎన్నో ఏళ్లుగా వెంకన్న స్వామి సేవలో తరిస్తున్నారు పరదాల మణి. 27 ఏళ్లుగా శ్రీవారికి పరదాలు ఇస్తున్నారు. ఈ నెల 15న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరగనుంది. దీని కోసం పరదాల మణి సోమవారం తిరుమలకు కాలినడకన చేరుకున్నారు. ఆయన దేవస్థానం అధికారులకు పరదాలు, కురాళాలు అందించారు. ఈ సారి కూడా మణి ప్రత్యేకంగా శ్రీవారి నేత్ర దర్శనం పరదాలను తయారు చేశారు. అంతేకాకుండా సిరులు కురిపించే శ్రీమహాలక్ష్మి, శంకు, చక్రాలు, పూర్ణకుంభం, గజ వాహనంపై తిరునామం, తామర పుష్పం వంటి డిజైన్లతో పరదాలను రూపొందించారు మణి. తిరుమల శ్రీవారికి పరమ భక్తుడు, టైలర్‌గా జీవితం ప్రారంభించి, వృత్తినే ఇంటి పేరుగా మార్చుకున్నారు మణి. ఆయన శ్రీనివాసుడి పిలుపుతో వైకుంఠనాధుడికి పరదాలు సమర్పించే భాగ్యం పొందాడు. 1999లో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో హుండీ ఏర్పాటు చేసే అవకాశం వచ్చింది. మొదటిసారిగా ఆయన బట్టలతో హుండీని తయారు చేశాడు. దీంతో ఆలయ అధికారుల మన్ననలు పొందాడు. ప్రదక్షిణలు చేస్తూ స్వామి సేవలో తరించే అవకాశం ఇవ్వమని కోరుకునేవాడు. 27 ఏళ్లుగా మణి శ్రీవారి ఆలయానికి పరదాలు అందిస్తున్నారు.