తిరుపతి నగరంలోని అంబేద్కర్ భవన్‌లో దళిత సంఘాల నేతలు సమావేశమై గిరిజన యువకుడు పవన్‌పై జరిగిన దారుణ దాడి ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న నేతలు పవన్‌ను చిత్రహింసలకు గురిచేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అంతేకాదు, ఈ దాడి వెనుక భూమన కుటుంబం ప్రమేయం ఉందా అనే అనుమానాలపై సమగ్ర విచారణ జరపాలని కోరారు.
ఈ సమావేశంలో మాట్లాడుతూ దళిత సంఘాల నేతలు, భూమన కరుణాకర్ రెడ్డి, అభినయ రెడ్డిలను తిరుపతి నగరం నుంచి బహిష్కరించాలని గట్టిగా వాదించారు. “పవన్‌పై జరిగిన ఈ దాడి ఘటనపై భూమన ఎందుకు స్పందించడం లేదు? ఇది మరింత అనుమానాలకు తావిస్తోంది” అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. దళితులు, గిరిజనులపై ఇలాంటి దాడులు చేయాలనుకునే వారికి ఇది హెచ్చరికగా ఉండాలని మరోసారి ఇలాంటి ఘటనలు జరిగితే వైసీపీ కార్యకర్తలను తరిమి తరిమి కొడతామని తీవ్రస్థాయిలో హెచ్చరించారు.
ఈ సమావేశం దళిత సమాజంలో ఆందోళనలు రేకెత్తిస్తోంది. నేతలు తమ మాటల్లో ఆవేదనను వ్యక్తం చేస్తూ న్యాయం జరగాలని బాధితులకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. తిరుపతి ప్రాంతంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని వారు అభ్యర్థించారు.