భార్యకు చిత్రహింసలు : శాడిస్ట్ భర్త, అతడి తల్లి అరెస్ట్!
రేవంత్ ఆగడాలు అంతటితో ఆగకుండా భార్యను కాల్‌గర్ల్‌గా చిత్రీకరిస్తూ ఆమె స్నేహితుల వాట్సప్ గ్రూప్‌లో పోస్టు పెట్టాడు. రెండు రోజుల క్రితం ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది.;
భార్యను చిత్రహింసలకు గురిచేస్తున్న ఓ శాడిస్ట్ భర్తను, అతడి తల్లిని తిరుపతి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు తిరుపతిలోని టీటీడీ ఎస్జీఎస్ ఆర్ట్స్ కళాశాలలో ఉద్యోగిగా పనిచేసే రేవంత్ ఐదు నెలల క్రితం బెంగళూరుకు చెందిన యువతిని వివాహం చేసుకున్నాడు. పెళ్ళైనా నాటి నుంచి భార్యను చిత్ర హింసలకు గురి చేశాడు. ఈ విషయాన్ని రేవంత్ తల్లికి చెప్పినా పట్టించుకోలేదు.
రేవంత్ ఆగడాలు అంతటితో ఆగకుండా భార్యను కాల్‌గర్ల్‌గా చిత్రీకరిస్తూ ఆమె స్నేహితుల వాట్సప్ గ్రూప్‌లో పోస్టు పెట్టాడు. రెండు రోజుల క్రితం ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. ఇంట్లో నుంచి తన భార్య పది లక్షల రూపాయల నగదు, నగలు తీసుకువెళ్లిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు రేవంత్. తనను దొంగగా, కాల్‌గర్ల్‌గా ప్రచారం చేయడంతో సదరు యువతి బెంగళూరు నుంచి నేరుగా తిరుపతిలోని దిశ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేసింది. అక్కడ తన ఒంటిపై గాయాలను చూపించింది.
రేవంత్‌ను పిలిపించి విచారించి చేప్పట్టి కేసు పెట్టారు. ఆ సమయంలో దిశ స్టేషన్‌లోనే రేవంత్ దురుసుగా ప్రవర్తించాడు. భార్యను, ఆమె బంధువులను అవమానిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. కేసు పెట్టారని వెయ్యి రూపాయల ఫైన్ కడితే సరిపోతుందంటూ వెళ్లిపోయాడు.
శారీరకంగా, మానసికంగా చిత్రహింసలకు గురి చేసిన రేవంత్‌పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ బాధితురాలి బంధువులు రేవంత్ ఇంటి ముందు నిరసనకు దిగారు. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు దిశా డీఎస్పీని అక్కడికి పంపించారు. రేవంత్‌పై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేస్తామని డీఎస్పీ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
అనంతరం అలిపిరి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి రెండోసారి ఫిర్యాదు చేసింది. బుధవారం రాత్రి రేవంత్‌ను, అతడి తల్లి ప్రసన్న జ్యోతిని పోలీసులు అరెస్టు చేశారు.