Tirupati: జై అమరావతి నినాదాలతో హోరెత్తిన తిరుపతి..

Tirupati: కలియుగ వైకుంఠం తిరుపతి.. జన ప్రభంజనమైంది. జై అమరావతి జైజై అమరావతి నినాదాలతో హోరెత్తిపోయింది.

Update: 2021-12-17 12:30 GMT

Tirupati Sabha (tv5news.in)

Tirupati: కలియుగ వైకుంఠం తిరుపతి.. జన ప్రభంజనమైంది. జై అమరావతి జైజై అమరావతి నినాదాలతో హోరెత్తిపోయింది. ఎటు చూసినా ఆకుపచ్చ జెండాలే.. ఎటు చూసినా జనమే. పురుషులు, మహిళలు.. యువకులు, వృద్ధులు అన్న తేడాలు లేకుండా ఆంధ్రుల ఏకైక రాజధాని అమరావతే అని గర్జిస్తూ తరలివచ్చిన జనంతో.. తిరుపతి దామినీడు ప్రాంతం జనసంద్రాన్ని తలపించింది.

ఆటంకాలు, ఆంక్షలు.. జన ప్రవాహాన్ని ఆపలేకపోయాయి. అడ్డంకులు.. ప్రజా ఉద్యమాన్ని నిలువరించలేకపోయాయి. ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని.. జై అమరావతి.. జైజై అమరావతి.. అన్న నినాదాలతో సభా స్థలి దద్దరిల్లిపోయింది. లక్ష మంది తరలి వస్తారని నిర్వాహకులు అంచనా వేసినా అంతకు మించే జనం తరలివచ్చి సభను జయప్రదం చేశారు. తద్వారా రాజధాని విషయంలో తమ ఆకాంక్ష ఏంటో వేంకటేశుని సాక్షిగా చాటిచెప్పారు.

అమరావతి పరిరక్షణ సమితి మహోద్యమ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరుకాగా.. బీజేపీ, జనసేన, సీపీఐ నేతలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. దళిత జేఏసీ, మైనార్టీ జేఏసీ నేతలు.. రైతుల ఉద్యమానికి బాసటగా నిలిచారు. లక్ష మంది కోసం సభా స్థలిని సిద్ధం చేయగా.. దానికి రెండింతల జనం తరలివచ్చారు.

ఆంధ్రుల రాజధాని అమరావతి నినాదానికి మద్దతిచ్చారు. దీంతో తిరుపతిలో వీధులు జన సందోహంతో నిండిపోయాయి. అతిరథమహారథుల వాహనాలతో కిక్కిరిసిపోయాయి. వైసీపీ రెబల్‌ ఎంపీ రఘురామకృష్ణరాజు, హీరో శివాజీ లాంటి వాళ్లు రైతుల ఉద్యమానికి మద్దతిచ్చారు. సభలో పాల్గొన్ని రైతుల పోరాటానికి సంఘీభావం ప్రకటించారు.

ఓ ఆంధ్రుడా మేలుకో.. నీ రాజధానిని నిలుపుకో అంటూ సాగిన సాంస్కృతిక కార్యక్రమాలు.. సభను హోరెత్తించాయి. అలుపెరగని పోరాటం చేస్తున్న రైతుల పోరాటానికి ఊరటనిచ్చాయి. జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ తరఫున సందేశాన్ని తీసుకువచ్చిన ఆ పార్టీ ప్రతినిధి రామదాసుచౌదరి.. రాజధానిగా అమరావతే కొనసాగాలన్నది తమ పార్టీ అభిమతమన్నారు. ఆంధ్రుల ఏకైక రాజధాని అమరావతే అని అన్నారు. రైతుల మహాపాదయాత్ర.. 5కోట్ల ఆంధ్రుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోతుందని పవన్‌కళ్యాణ్‌ సందేశాన్ని వినిపించారు. దీంతో సభా ప్రాంగణం చప్పట్లో మార్మోగిపోయింది. జై అమరావతి నినాదాలతో దద్దరిల్లింది. 

Tags:    

Similar News