కర్నూలు జిల్లాలో తీవ్ర విషాదం జరిగింది. సరదాగా ఆడుకుంటున్న చిన్నారులు ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి ప్రాణాలు కోల్పోయారు. ఆరుగురు చిన్నారులు ఒకేసారి చనిపోవడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పిల్లల తల్లితండ్రుల రోదనలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. ఈ హృదయ విదారక ఘటనకు వేదిక అయింది ఆస్పరి మండలంలోని చిగిలి గ్రామం.
పోలీసుల వివరాల ప్రకారం...గ్రామానికి చెందిన శశికుమార్, కిన్నెర సాయి, సాయి కిరణ్, భీమా, వీరేంద్ర, మహబూబ్ అనే ఆరుగురు విద్యార్థులు స్థానికంగా ఉన్న పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్నారు. రోజూ లాగే సరదాగా ఆడుకుందాం అనుకున్న ఆ చిన్నారులను నీటి కుంట రూపంలో ఉన్న మృత్యువు కబళించింది. పాఠశాల సమీపంలో ఆడుకుంటూ ఉండగా అక్కడే ఉన్న నీటి కుంటలో అదుపుతప్పి పడిపోయారు. నీటి కుంట లోతు ఎక్కువగా ఉండటంతో నీటిలో మునిగి ఆరుగురూ చిన్నారులు మరణించారు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు...పిల్లల మృత దేహాలను బయటకు తీశారు. తమ కళ్ళ ముందే సంతోషంగా ఉన్న పిల్లలు..గంటల వ్యవధిలోనే మృత్యు ఒడికి చేరడంతో వారి తల్లితండ్రులు తట్టుకోలేకపోయారు. చిన్నారుల మృత దేహాలపై పడి వారు ఏడ్చిన తీరు అందరిని కంటతడి పెట్టించింది.
కాగా ఈ ఘటన పై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆరుగురు చిన్నారులు ఒకేసారి మరణించడం తనను తీవ్రంగా కలచివేసిందని అన్నారు. "ఎంతో భవిష్యత్తు ఉన్న చిన్నారులు ఇలా అర్థాంతరంగా తనువు చాలించడం వారి కుటుంబాలకు తీరని లోటు. వారికి కడుపుకోత మిగిల్చింది. ఈ ఘటన అత్యంత బాధాకరం" అని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన సీఎం.. వారికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.