PHONE TAP: కొనసాగుతున్న ఫోన్ ట్యాపింగ్ ప్రకంపనలు
త్రిపుర గవర్నర్ ఫోన్ ట్యాప్... సంచలనం సృష్టిస్తున్న అంశాలు;
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ప్రకంపనలు రేపుతోంది. దర్యాప్తు మొదలై దాదాపు ఏడాది కావొస్తున్నా నేటికీ సంచలన విషయాలు బహిర్గతమవుతూనే ఉన్నాయి. త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి ఫోన్ కూడా ట్యాప్ అయినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి ఫోన్ కూడా ట్యాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. 2023 నవంబర్ 15 నుంచి నవంబర్ 30 మధ్య ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు తెలిసింది. ఈ కేసులో ఇంద్రసేనారెడ్డి వ్యక్తిగత సహాయకుడు విచారణకు హాజరయ్యారు. గత ఎన్నికల సమయంలో ఎస్ఐబీ ఓఎస్టీ ప్రభాకర్ రావు నేతృత్వంలో ప్రముఖుల ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడగా.. అందులో గవర్నర్ పేరు ఉండడం కలకలం రేపుతోంది. ఈ కేసు విచారణ ముమ్మరంగా జరుగుతోంది.
గవర్నర్ ఓఎస్డీ ఫోన్ ట్యాప్
త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి ఓఎస్డీ జి.నర్సింహులు పేరిట ఉన్న ఫోన్ నంబరును తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచి కేంద్రంగా ట్యాప్ చేసినట్లు వెల్లడైంది. ఈ విషయంపై నర్సింహులును ఇప్పటికే పోలీసులు విచారించారు. మీరు చెప్పేవరకు ఈ విషయం తనకు తెలియదని ఆయన వాంగ్మూలం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నంబరును ట్యాప్ చేయాలని ఎస్‌ఐబీని ఎవరు ఆదేశించారనే విషయం అమెరికాకు పారిపోయిన ప్రధాన నిందితుడు ప్రభాకర్‌రావును విచారిస్తేనే తెలుస్తుందని పోలీసులు భావిస్తున్నారు. ఆయన్ను భారత్‌కు రప్పించేందుకు పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా సఫలీకృతం కాలేకపోతున్నారు. తెలంగాణ గవర్నర్‌గా పనిచేసిన తమిళిసై ఫోన్‌నూ ట్యాప్ చేసినట్లు గతంలో ప్రచారం జరిగినా.. దర్యాప్తు క్రమంలో ఇప్పటివరకు అలాంటి అంశం వెల్లడి కాలేదని తెలుస్తోంది.
కేంద్రంలోని సమాచారం కోసమేనా..?
ఇంద్రసేనారెడ్డి 2014 నుంచి తన ఓఎస్డీ పేరిట ఉన్న ఫోన్ నంబరునే వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. 2023 నవంబరులో జరిగిన శాసనసభ ఎన్నికలకు కొద్దిరోజుల ముందు ఈ నంబరును ఎస్‌ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్‌రావు బృందం ట్యాపింగ్ జాబితాలో చేర్చినట్లు పోలీసుల తాజా దర్యాప్తులో వెల్లడైంది. 2023 అక్టోబరు 18న త్రిపుర గవర్నర్‌గా నియమితులైన ఇంద్రసేనారెడ్డి.. అదే నెల 26న బాధ్యతలు స్వీకరించారు. అప్పటికే ట్యాపింగ్ వ్యవహారం సాగుతున్న నేపథ్యంలో ఆయన నంబరునూ చేర్చినట్లు సమాచారం.