తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఛైర్మన్ బీఆర్ నాయుడు అమరావతి వెంకటపాలెంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఓ సాధారణ భక్తుడిలా ఆలయానికి చేరుకున్న ఆయన, అక్కడి నిర్వహణ తీరును స్వయంగా పరిశీలించి పలు లోపాలను గుర్తించారు. ఆలయ సిబ్బంది పనితీరుపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ నాయుడు మాట్లాడుతూ, "ఈరోజు వెంకటపాలెం ఆలయాన్ని ఆకస్మికంగా సందర్శించాను. సాధారణ భక్తుడిలా దర్శనానికి వెళ్లినప్పుడు ఆలయ నిర్వహణలో కొన్ని నిర్లక్ష్యాలు నా దృష్టికి వచ్చాయి" అని తెలిపారు. స్వామివారి అలంకరణ మొదలుకొని సిబ్బంది ప్రవర్తన వరకు అనేక విషయాల్లో అలసత్వం కనిపించడం తనను ఎంతో బాధించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.