అమరావతిలో రెండు వర్గాల మధ్య ఘర్షణ.. రాళ్ల దాడిలో మహిళ మృతి

రెండు సామాజికవర్గాలు రాళ్లతో దాడి చేసుకోవడంతో మరియమ్మ అనే మహిళ చనిపోయింది.

Update: 2020-12-28 07:34 GMT

అమరావతిలోని తుళ్లూరు మండలం వెలగపూడి ఎస్సీ కాలనీలో అర్ధరాత్రి రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. రెండు సామాజికవర్గాలు రాళ్లతో దాడి చేసుకోవడంతో మరియమ్మ అనే మహిళ చనిపోయింది. దీంతో కోపోద్రిక్తులైన ఓ సామాజికవర్గం వాళ్లు మహిళ మృతదేహంతో ఆందోళనకు దిగారు.

వెలగపూడి ఎస్సీ కాలనీలో ఆర్చి నిర్మించి.. దానికి బాబు జగ్జీవన్‌రామ్‌ పేరు పెట్టాలని.. ఎంపీ నందిగం సురేశ్ అనుచరులు ప్రయత్నిస్తున్నట్లు ఓ సామాజికవర్గం వాళ్లు ఆరోపిస్తున్నారు. తమ సామాజికవర్గాన్ని దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందంటూ ఎంపీ సురేశ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ సురేశ్ ప్రోద్బలంతోనే తమపై దాడికి దూసుకొస్తున్నట్లు ఒక సామాజికవర్గం ఆరోపిస్తోంది. రెండు రోజుల క్రితం ఇదే విషయంపై వివాదం జరగ్గా.. పోలీసులు వివాదాన్ని సర్దుబాటు చేశారు. కాని, అర్థరాత్రి సమయంలో పక్కా ప్రణాళికతో రాళ్ల దాడి చేశారు. ఈ ఘర్షణలో మరియమ్మ చనిపోగా.. 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో మమ్మల్ని బతకనివ్వండంటూ ఒక సామాజికవర్గానికి చెందిన వారు అర్ధరాత్రి ఆందోళనకు దిగారు. ప్రస్తుతం వెలగపూడి ఎస్సీ కాలనీ వద్ద పోలీసులను భారీ ఎత్తున మోహరించారు.


Tags:    

Similar News