తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై కేంద్రం క్లారిటీ
Andhra Pradesh and Telangana: తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు ఇప్పట్లో ఉండదని తేల్చి చెప్పింది కేంద్రం.;
Andhra Pradesh and Telangana: తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు ఇప్పట్లో ఉండదని తేల్చి చెప్పింది కేంద్రం. 2026లో జనాభాను లెక్కించిన తరువాతే నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందని చాలా స్పష్టంగా చెప్పింది. ఎంపీ రేవంత్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రం లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. నిజానికి ఏపీ విభజన చట్టం ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచాలి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 170లోని నిబంధనల ప్రకారం ఏపీలో అసెంబ్లీ స్థానాలను 175 నుంచి 225కి, తెలంగాణలో 119 నుంచి 153కి పెంచాలని విభజన చట్టం చెబుతోంది.
కాని, కేంద్రం మాత్రం రాజ్యాంగంలోని ఆర్టికల్ 179(3)ని మాత్రమే అనుసరిస్తామని చెప్పింది. 2026 తర్వాత ప్రచురించే జనాభా లెక్కల తరువాతనే రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల సర్దుబాటు జరుగుతుందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.
కేంద్రం చెబుతున్న రూల్స్ ప్రకారం 2039 వరకు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెరుగుదల లేనట్టే. దీనిపై రాజకీయ నేతలు మండిపడుతున్నారు. జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ స్థానాలను పెంచుతున్నప్పుడు.. తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు పెంచరని ప్రశ్నిస్తున్నారు. ఆర్టికల్ 370 రద్దు చేసిన తరువాత.. జమ్ము కశ్మీర్‌లోనూ భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అలాంటప్పుడు రాజ్యాంగ నిబంధనల ప్రకారమే అక్కడ కూడా అసెంబ్లీ నియోజకవర్గాలను పెంచాల్సి ఉంటుంది. కాని, నిబంధనలకు విరుద్ధంగా జమ్ము కశ్మీర్‌లో అసెంబ్లీ సీట్లను 83 నుంచి 90కి పెంచడానికి నిర్ణయించింది కేంద్రం.
కేంద్రం ఎన్ని చెబుతున్నప్పటికీ.. తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు సాధ్యం అనే చెబుతున్నారు రాజకీయ నాయకులు. న్యాయశాఖ ఉన్నతాధికారులు సైతం అసెంబ్లీ సీట్ల పెంపుపై ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. విభజన చట్టంలోని సెక్షన్ 26లో సబ్జెక్ట్ అనే పదాన్ని తొలగించి, నాట్ విత్‌స్టాండింగ్ అనే పదాన్ని చేర్చి, చట్ట సవరణ చేస్తే.. అసెంబ్లీ సీట్లను పెంచే అవకాశం ఉంటుందని తెలిపారు. కేంద్రానికి మనసుంటే విభజన చట్టంలో వెంటనే సవరణలు చేయొచ్చంటున్నారు రాజకీయ నేతలు.