KISHAN: తెలంగాణలో మెరుగైన ఫలితాలు
ఆరు గ్యారెంటీలు అమలు చేసే సత్తా కాంగ్రెస్‌కు లేదు... విజయసంకల్పయాత్రలో కిషన్‌రెడ్డి విమర్శలు;
కేంద్రంలో అధికారం చేపడుతామని ధీమా వ్యక్తం చేస్తున్న బీజేపీ తెలంగాణలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు విజయసంకల్పయాత్ర చేపడుతోంది. కేంద్రమంత్రులు, భాజపా పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో రోడ్‌షోలు, సభలు నిర్వహిస్తోంది. ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేసే సత్తా కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి విమర్శించారు. ఇంకో రెండు నెలలయితే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలివ్వలేని పరిస్థితి వస్తుందని ఎద్దేవా చేశారు. బీజేపీకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి తట్టుకోలేకే పొత్తులంటూ దుష్ప్రచారం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు విమర్శించారు. లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా విజయ సంకల్ప సభలు నిర్వహిస్తున్న బీజేపీ నేతలు.. బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు కుటుంబ, అవినీతి పార్టీలేనని మెదక్ జిల్లా తూప్రాన్‌లో కిషన్‌రెడ్డి విమర్శించారు. బీజేపీకి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే బీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకుంటున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నాయంటూ ప్రచారాలు చేస్తున్నారని రఘునందర్ రావు విమర్శించారు. మెదక్ జిల్లా చాకరిమెట్ల హనుమాన్ ఆలయంలో పూజలు చేసిన రఘునందన్ సమీపంలోని తండాలో లంబాడా మహిళలతో కలిసి నృత్యం చేశారు. అనంతరం వారు ఇచ్చిన రోట్టెలను పచ్చడితో తిన్నారు. దేశాన్ని 70ఏళ్లు పాలించి పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిన కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని కేంద్రమంత్రి పురుషోత్తం రూపాల పిలుపునిచ్చారు. ప్రజాశీర్వాదంతో రెండుసార్లు ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోదీ.. అన్ని వర్గాలకు సమన్యాయం చేశారని తెలిపారు. పెద్దపల్లి జిల్లా రామగిరిలో విజయ సంకల్ప సభలో ఆయన పాల్గొన్నారు.
పేదవాళ్లు, గిరిజనుల అభివృద్ధి కోసం నిబద్ధతతో పనిచేసే పార్టీ బీజేపీనేనని ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్ అన్నారు. భద్రాచలంలో విజయ సంకల్ప సభలో పాల్గొన్న విష్ణుదేవ్...చిన్న స్థాయి కార్యకర్తలు సైతం ముఖ్యమంత్రులు, ప్రధాని, రాష్ట్రపతులు అయ్యే అవకాశం బీజేపీలోనే ఉందని వెల్లడించారు. శ్రీ సీతారామ చంద్ర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. హైదరాబాద్‌లో జరిగిన విజయ సంకల్ప యాత్రలో భాజపా నేతలు పాల్గొన్నారు. జవహర్ నగర్ నుంచి రాంపల్లి చౌరస్తా, బండ్లగూడ మీదుగా కీసర ఔటర్ రింగ్‌రోడ్డు వరకు యాత్ర కొనసాగింది.