తప్పుడు ప్రచారం చేయడానికి కూడా ఒక హద్దు అనేది ఉంటుంది. అలాంటి ప్రచారం చేయడానికి కూడా ఒక సమయం ఉంటుంది. కానీ ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు.. రాష్ట్రాన్ని ఒక విపత్తు ముంచేస్తున్నప్పుడు చేయకూడదు కదా. కానీ వైసీపీకి అలాంటి ఇంకిత జ్ఞానం అనేది లేదు. ఆ పార్టీ చేస్తున్న తప్పుడు ప్రచారాలకు ప్రజలు కూడా విసుగెత్తిపోయారు. మొంథా తుఫాన్ ఏపీని అతలాకుతలం చేస్తే.. కూటమి ప్రభుత్వం చాలా అప్రమత్తంగా వ్యవహరించి ఆ నష్టాన్ని భారీగా జరగకుండా పూడ్చివేసింది. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రతిక్షణం అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ.. ప్రభావిత ప్రాంతాలలో పర్యటిస్తూ ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేశారు. వాళ్లు నిద్రపోకుండా అధికారులను నిద్రపోనివ్వకుండా ప్రతిక్షణం అలర్ట్ గా పని చేశారు కాబట్టి అంత పెద్ద తుఫాను వచ్చినా సరే ప్రాణ నష్టం లేకుండా భారీగా ఆస్తి నష్టం జరగకుండా కాపాడగలిగారు. కానీ ఇదే వైసీపీకి మాత్రం ఏమాత్రం బాధ్యత లేకుండా చాలా దరిద్రంగా వ్యవహరించింది.
ముందు అసలు తుఫాన్ లేదని ప్రచారం చేసిన ఆ పార్టీ.. తర్వాత పట్టించుకోవట్లేదు అంటూ మళ్ళీ కల్లబోల్లి మాటలు మాట్లాడింది. వైసీపీ నాయకులు ఒక్కరు కూడా ఈ సమయంలో ప్రజలకు అండగా నిలబడలేదు. తుఫాన్ సమయంలో ప్రజల మధ్య ఉండకుండా ప్రభుత్వానికి సహకరించకుండా ఏమాత్రం బాధ్యత లేకుండా తమ ఇంట్లో సేద తీరారు. ఇక మాజీ సీఎం జగన్ అయితే ఏపీలో కూడా ఉండకుండా దెబ్బకు బెంగుళూరు పారిపోయి అక్కడ ప్యాలెస్ లో రెస్ట్ తీసుకున్నాడు. అక్కడ ఉండి కూటమి ప్రభుత్వంపై తన సోషల్ మీడియాలో, వైసిపి మీడియాలో రకరకాల బురదజల్లే ప్రయత్నం చేశారు. ఎక్కడో ఒక మహిళ చెట్టు కొమ్మ విరిగి చనిపోతే.. దానికి కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం అంటూ దిక్కుమాలిన రాతలు రాశారు. ఒక మహిళ చనిపోతే అది బాధాకరం. కానీ అది మానవ తప్పిదం. అందులో కూటమి తప్పు లేదు కదా. ఎక్కడో ఒక కారు మీద కొబ్బరి బొండం తెగిపోయి పడితే.. దాన్ని కూడా కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం అంటూ వైసీపీ ప్రచారం చేసింది. కానీ ఇదే జగన్ సీఎంగా ఉన్నప్పుడు భారీగా వర్షాలకు పట్టణష్టం జరిగితే.. అప్పట్లో ఆయన పరిశీలించేందుకు వెళ్లిన తీరు ఏ స్థాయిలో విమర్శలకు తావిచ్చిందో చూశాం.
ఒక పంట పొలం దగ్గర టెంటు, స్టేజ్, రెడ్ కార్పెట్ వేయించుకొని కాలికి మట్టి అంటకుండా రైతులనే తన దగ్గరకు పిలిపించుకొని పరామర్శించారు. కనీసం పంటల దగ్గరికి వెళ్లలేదు. పొలంలోకి దిగలేదు. ఆ పంటలను కూడా చేతితో పట్టుకోవడానికి ఇష్టపడకుండా ముసి ముసి నవ్వులు నవ్వుతూ వచ్చారు. కానీ ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా పట్ట నష్టం జరిగిన పొలాల వద్దకు వెళ్లి పొలంలో దిగి మరీ పరిశీలించారు. పంట నష్టం వివరాలు పంపించాలని.. నష్ట పరిహారం అందిస్తామని అక్కడికక్కడే హామీ ఇచ్చారు. జగన్ పాలనకు కూటమి ప్రభుత్వ పాలనకు ఇంత తేడా ఉంది. మొన్న నారా లోకేష్ ను ప్రెస్ మీట్ లో రాజకీయాలకు సంబంధించిన ప్రశ్న వేస్తే.. దానికి ఇది సమయం కాదని తుఫాన్ అయిపోయిన తర్వాత మాట్లాడుకుందాం అన్నారు. అంటే ఏ సమయంలో ఏం మాట్లాడాలో కూటమినేతలకు తెలిసినంత.. వైసీపీ నేతలకు మాత్రం తెలియట్లేదు. ఇప్పటికైనా ఇలాంటివి మానుకుంటేనే ప్రజల్లో వైసీపీకి ఎంతో కొంత సానుకూలత ఉంటుంది. లేదంటే ప్రజలు ఛీ కొట్టే పరిస్థితి వస్తుంది.