తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు సంబంధించిన కేసులో నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు షాక్ ఇచ్చింది. విచారణకు మంత్రి హాజరుకాకపోవడంతో న్యాయస్థానం ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. గత అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఉత్తమ్ కుమార్ రెడ్డి సభ నిర్వహించి, ట్రాఫిక్కు అంతరాయం కలిగించారని పోలీసులకు ఫిర్యాదులు అందాయి. దీంతో మంత్రిపై అప్పట్లో పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయగా... ఈ కేసుకు సంబంధించి నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో మంత్రి ఉత్తమ్ విచారణకు హాజరు కాకపోవటంతో ఆయన వైఖరిపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేస్తూ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అనంతరం కేసు తదుపరి విచారణను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసి.. ఆ రోజు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యక్తిగతంగా విచారణకు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించింది.