TG: నేటి నుంచి 'ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక'
99 రోజులపాటు జరగనున్న కార్యక్రమాలు
తెలంగాణ ప్రభుత్వం నేడు మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. 'ప్రజా ప్రభుత్వం-ప్రగతి ప్రణాళిక' పేరుతో 99 రోజులపాటు కార్యక్రమాలు జరగనున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం పాలనను, అభివృద్ధిని ప్రజలకు వివరించనున్నారు. నేటి నుంచి జూన్ 12 వరకు నిర్వహించనున్న కార్యాచరణను ప్రభుత్వం రూపొందించి ప్రత్యేక లోగోను ఆవిష్కరించింది. సీఎం నుంచి వార్డు మెంబర్లు, ప్రజా ప్రతినిధులు, అధికారులందరూ భాగస్వాములు కానున్నారు
తెలంగాణలో ప్రజలు కోరుకున్న మార్పు దిశగా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని, వరుస ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన మద్దతు తమపై ఉంచిన విశ్వాసానికి నిదర్శనమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం తమ బాధ్యత అని, మిగిలిన పరిపాలన కాలంలో మరింత ఫలితాలపై దృష్టి సారించాలని ఉన్నతాధికారులకు సూచించారు. శనివారం సచివాలయంలో అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులతో జరిగిన సమీక్షా సమావేశంలో సీఎం పలు కీలక దిశానిర్దేశాలు ఇచ్చారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్‌రెడ్డి సహా ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు మూడు నెలలు పూర్తయ్యాయని గుర్తుచేసిన ముఖ్యమంత్రి, ఇప్పటివరకు అమలు చేసిన పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై నిజాయతీతో సమీక్ష జరపాలని సూచించారు. ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయో గుర్తించి, మిగిలిన రెండేళ్ల తొమ్మిది నెలల కాలానికి స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పారదర్శకత, జవాబుదారీతనం అత్యంత ముఖ్యమని ఆయన అన్నారు.
ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతున్నామని సీఎం వెల్లడించారు. నేటి నుంచి జూన్ 12 వరకు మొత్తం 99 రోజులపాటు గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ ప్రణాళికను బాధ్యతగా నిర్వహించాలని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమానికి ప్రత్యేక లోగో రూపొందించాలని, 99 రోజులపాటు నిర్వహించాల్సిన కార్యక్రమాలపై సీఎస్ సమగ్ర షెడ్యూల్ సిద్ధం చేయాలని సూచించారు. ఈ వ్యవధిలో ప్రభుత్వ కార్యాలయాల్లో పెండింగ్ దస్త్రాల పరిష్కారంపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని, ప్రణాళిక పురోగతిని తాను రోజువారీగా సమీక్షిస్తానని తెలిపారు. అధికారుల పనితీరులో లోపాలను సహించబోమని హెచ్చరించారు.
రేషన్‌కార్డుల దరఖాస్తు ప్రక్రియ నిరంతరంగా కొనసాగాలని, ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు విద్యాసంస్థలకు దీటుగా తీర్చిదిద్దాలని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రంలోని వంద మండలాల్లో తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ప్రారంభించే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వ విద్యను ప్రక్షాళన చేయడంతోపాటు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యసేవలను మెరుగుపరిచే విధానాలను అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఐఏఎస్ అధికారి తమ శాఖలో ఉత్తమ కార్యక్రమాలను రూపకల్పన చేసి అమలు చేయాలని, అలాగే వాటి ఫలితాలను ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత కూడా అధికారులదేనని సీఎం స్పష్టం చేశారు. శాఖల పనితీరుపై పూర్తి అవగాహన ఉండాలన్నారు.