పవన్ కల్యాణ్ పై పరువునష్టం కేసులో ఫిర్యాదుదారులకు చుక్కెదురు
ఈ అంశం తమ పరిధిలోకి ఎలా వస్తుందో స్పష్టత ఇవ్వాలని ప్రశ్నించిన కోర్టు;
జనసేనాని పవన్ కళ్యాణ్‌పై నమోదైన క్రిమినల్ పరువు నష్టం కేసును విజయవాడ సిటీ సివిల్ కోర్టు తిప్పి పంపించింది. వాలంటీర్ వ్యవస్థకు పరువు నష్టం కలిగేలా పవన్ కళ్యాణ్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పవన్‌పై ఓ మహిళా వాలంటీర్ ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన కోర్టు ఈ అంశం తమ పరిధిలోకి ఎలా వస్తుందో స్పష్టత ఇవ్వాలని ప్రశ్నించింది. అలాగే పవన్ వ్యాఖ్యలు ఫిర్యాదురాలి ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయని చెప్పేందుకు సరైన ఆధారాలు సమర్పించాలని కోర్టు సూచించింది. ఇటీవల ఏలూరులో సభలో వాలంటీర్ల ప్రతిష్ఠకు పరువు నష్టం కలిగేలా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారని విజయవాడ శాంతినగర్‌కు చెందిన రంగవల్లి అనే మహిళా వాలంటీరు కోర్టులో ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన విజయవాడ కోర్టు తగిన వివరణ ఇవ్వాల్సిందిగా ఫిర్యాదుదారుని కోరింది.